సిబ్బంది కొరతతో నిఘా గాలికి..
నెల్లూరు రైల్వే డివిజన్ పరిధిలో బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి జిల్లాలు వస్తాయి. 444 కిలోమీటర్ల మేర రైల్వే లైను విస్తరించి ఉంది. నెల్లూరు సర్కిల్ పరిధిలో నెల్లూరు, తిరుపతి జిల్లా (ఉమ్మడి నెల్లూరు జిల్లా)లోని గూడూరు, కావలి రైల్వే పోలీసు స్టేషన్లు ఉన్నాయి. సూళ్లూరుపేట, బిట్రగుంట, కృష్ణపట్నం పోర్టులో అవుట్ పోస్టులున్నాయి. ఒంగోలు సర్కిల్ పరిధిలో ఒంగోలు, బాపట్ల జిల్లాలో (ఉమ్మడి ఒంగోలు)ని చీరాల రైల్వే పోలీసుస్టేషన్లు ఉన్నాయి. సింగరాయకొండలో పోలీసు అవుట్ పోస్టుంది. నెల్లూరు రైల్వే డివిజన్ పరిధిలో 151 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం సుమారు 108 మంది ఉన్నట్లు సమాచారం. రైళ్ల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ అందుకు సరిపడా సిబ్బంది నియామకాలు జరగడం లేదు. ఒకప్పుడు బ్యాగ్, గొలుసు, జేబు దొంగతనాలు జరిగేవి. ప్రస్తుతం నేరస్తులు నూతన పంథాల్లో నేరాలకు పాల్పడుతున్నారు. దోపిడీలు, దొంగతనాలు, మత్తు మందులిచ్చి ఆభరణాలు, నగదు అపహరణ, సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి దోపిడీలకు పాల్పడడంతో పాటుగా గంజాయి, మాదకద్రవ్యాలు, బంగారం, వెండి ఆభరణాల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సిబ్బంది విధుల్లోనూ మార్పులు వచ్చాయి. సిబ్బంది కొరత కారణంగా నేర నియంత్రణ, కేసుల పరిష్కారం వారికి తలకు మించిన భారంగా మారుతోంది. దీంతో ప్రయాణికుల భద్రతపై దృష్టి సారించలేకపోతున్నారనే అభిప్రాయాలున్నాయి. ఇది నేరగాళ్లకు కలిసొస్తోంది.


