పెళ్లి చేసుకుని మోసం చేశాడు
● భర్త ఇంటి ముందు భార్య ఆందోళన
సంగం: వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. సహజీవనం చేశారు. వివాహం చేసుకున్నారు. అయితే భార్యను వదిలేసి భర్త స్వగ్రామానికి వచ్చాడు. దీంతో మోసపోయానని గ్రహించిన గిరిజన యువతి సంగంలో భర్త ఇంటి వద్ద గురువారం ఆందోళన చేసింది. బాధిత యువతి స్థానిక పోలీసులకు తెలిపిన వివరాల మేరకు వివరాలిలా ఉన్నాయి.. బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగుకు చెందిన గిరిజన యువతి లక్ష్మి, సంగంలోని మసీదు సెంటర్‌కు చెందిన షేక్ మన్సూర్ ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. వేర్వేరు చోట్ల పనిచేస్తున్న వీరు ప్రేమించుకున్నారు. సహజీవనం చేశారు. లక్ష్మి ఒత్తిడితో నెలరోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ దేవాలయంలో వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మన్సూర్ తల్లిదండ్రులు, అన్న ఒత్తిడి చేయడంతో అతను సంగం వచ్చేశాడు. మరో మహిళతో వివాహానికి సిద్ధమయ్యాడని తెలుసుకున్న లక్ష్మి బుధవారం హైదరాబాద్ నుంచి సంగం వచ్చింది. మన్సూర్ లేకపోవడం.. అతని తల్లిదండ్రులు సరైన సమాధానం చెప్పకపోవడంతో వారి ఇంటి ముందు బైఠాయించింది. తనకు, మన్సూర్‌కు వివాహమైనట్లుగా ఫొటోలు చూపించి కన్నీటిపర్యంతమవుతోంది. గతంలో ఈ విషయమై సంగం, హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశానని లక్ష్మి చెబుతోంది. అప్పుడు హైదరాబాద్‌లో మన్సూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎలాంటి సమస్య లేకుండా చూసుకుంటానని చెప్పి మోసం చేయడంతో సంగం వచ్చానని లక్ష్మి వెల్లడించింది. అతని తల్లిదండ్రులను అభ్యర్థించినా పట్టించుకోవడం లేదని కన్నీరుమున్నీరైంది.
మన్సూర్ తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం
ఈ విషయమై ఎస్సై రాజేష్ స్పందిస్తూ మన్సూర్ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. భార్యాభర్తలను కలపాలని సూచించామన్నారు. లక్ష్మిని ఆమె బంధువులకు అప్పగించినట్లు చెప్పారు. ఈ విషయమై మన్సూర్ తల్లిదండ్రులను విలేకరులు ప్రశ్నించగా వారు సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.
పెళ్లి చేసుకుని మోసం చేశాడు


