
ఆటో డ్రైవర్‌పై పోక్సో కేసు నమోదు
సంగం: మండలంలోని తలుపూరుపాడుకు చెందిన ఆటో డ్రైవర్ షేక్ బాద్‌షాపై సోమవారం రాత్రి సంగం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఎస్సై నాగార్జునరెడ్డి సమాచారం మేరకు.. తలుపూరుపాడుకు చెందిన ఓ బాలిక తరుణవాయి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ షేక్ బాద్‌షా కొంత మంది పిల్లలను ప్రతి నిత్యం తరుణవాయి పాఠశాలకు తీసుకెళ్తుండేవారు. అందులోని ఓ బాలికను ప్రతి నిత్యం తన ముందు కూర్చొబెట్టుకుని అసభ్యకరంగా మాట్లాడుతూ వేధిస్తూ ఉండేవాడు. అయినప్పటికి ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పలేదు. ఇటీవల సెలవులు రావడంతో ఈ నెల 25వ తేదీ బాలికను వేరే ప్రాంతానికి వెళ్లి అక్కడే ఉందామని బలవంతం చేశాడు. దీంతో బాలిక ఆమె తల్లిదండ్రులకు విష యం తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.