తమ్ముళ్లు.. అటో.. ఎటో..! | Sakshi
Sakshi News home page

తమ్ముళ్లు.. అటో.. ఎటో..!

Published Thu, Apr 18 2024 11:40 AM

- - Sakshi

కందుకూరులో ఇదీ టీడీపీ పరిస్థితి

నేతల మధ్య కుదరని సఖ్యత

ఎవరికి వారే యమునా తీరే

కలిసిరాని దివి శివరామ్‌, పోతుల రామారావు

ఇంటూరి రాజేష్‌ వర్గం ప్రత్యేక శిబిరం

అయోమయంలో పార్టీ అభ్యర్థి నాగేశ్వరరావు

ఎన్నికలకు పట్టుమని నాలుగు వారాల్లేవు. ఈ దశలోనూ సయోధ్య కుదరక కందుకూరులో టీడీపీ దయనీయ స్థితిని ఎదుర్కొంటోంది. మొదట్నుంచి పార్టీ  జెండాను మోసిన వారిని విస్మరించి ఇతరులకు టికెట్‌ ఇవ్వడంపై ఆ పార్టీలో రాజుకున్న అంతర్గత పోరు నేడు మరింత తీవ్రమవుతోంది. నేతల మధ్య విభేదాలు రోజుకో తరహాలో బయటపడుతున్నాయి. అభ్యర్థి ఎంపిక విషయంలో టీడీపీ అధిష్టాన నిర్ణయాన్ని ఇంటూరి రాజేష్‌ బహిరంగంగా వ్యతిరేకిస్తుండగా.. పార్టీ అభ్యర్థికి మాజీ ఎమ్మెల్యేలు సహకరించే పరిస్థితి కానరావడంలేదు. ఈ తరుణంలో కీలక నేతల మధ్య కుమ్ములాటలతో పార్టీ కేడర్‌ డీలాపడుతోంది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కందుకూరులో టీడీపీ నేతలు ఎవరికి వారే యమునా తీరేననే చందంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావును అధిష్టానం ఖరారు చేయడంతో రాజుకున్న నిప్పు తగ్గకపోగా, ఎన్నికలు సమీపించే కొద్దీ మరింత ఎక్కువవుతోంది. ఈ పరిణామాలతో అయోమయ స్థితిలో కేడర్‌ కొట్టుమిట్టాడుతోంది.

వారి వైఖరి చర్చనీయాంశం
కందుకూరు నియోజకవర్గంలో ఇద్దరు మాజీ ఎమ్మె ల్యేలు దివి శివరామ్‌, పోతుల రామారావు శైలి ఆ పార్టీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో పార్టీ కార్యకలాపాలకు వీరు దూ రంగా ఉండటం అయోమయానికి కారణమవుతోంది. టీడీపీ అభ్యర్థి నాగేశ్వరరావుకు నిన్నా.. మొన్నటి వరకు అన్ని విధాలా అండదండలు అందించిన దివి శివరామ్‌ ఎన్నికల వేళ ముఖం చాటేస్తున్నారు.

మారిన వైఖరి
నియోజకవర్గంతో మాజీ ఎమ్మెల్యే దివి శివరామ్‌కు ఎంతో అనుబంధం ఉంది. ఈ తరుణంలో ఆయనకు పార్టీ అధిష్టానం ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ వచ్చింది. తనకున్న గుర్తింపుతో మొదట్లో నాగేశ్వరరావుకు పార్టీ ఇన్‌చార్జి పదవిని ఇప్పించారు. తదనంతరం అన్ని కార్యక్రమాల్లో నాగేశ్వరరావుకు శివరామ్‌ మద్దతిచ్చారు. అయితే నాగేశ్వరరావును అభ్యర్థిగా ప్రకటించాక శివరామ్‌ వైఖరి పూర్తిగా మారిపోయింది. టీడీపీ నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలోనూ వేదికపైకి శివరామ్‌ వెళ్లకుండా తన అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కారు. కొందరు పార్టీ నేతలు కలగజేసుకొని సర్దిచెప్పేందుకు యత్నించినా, ఆయన ససేమిరా అన్నారు.

వ్యతిరేక వర్గానికి సహకారం
మరోవైపు శివరామ్‌ సోదరులు లింగయ్యనాయుడు, రమేష్‌ సైతం నాగేశ్వరరావుకు దూరమయ్యారు. నాగేశ్వరరావును వ్యతిరేకిస్తున్న ఇంటూరి రాజేష్‌తో వీరు చేతులు కలుపుతున్నారు. రాజేష్‌ నిర్వహించే వ్యతిరేక కార్యక్రమాలకు సైతం హాజరవుతున్నారు. నియోజకవర్గంలో ప్రస్తుతం నాగేశ్వరరావు వర్సెస్‌ దివి అనే తరహాలో రాజకీయాలు సాగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో మీకు సహకరించేది లేదంటూ నాగేశ్వరరావుకు వీరు ముఖానే చెప్పారనే ప్రచారమూ ఉంది. దీంతో అసలు వీరిద్దరి మధ్య ఏమి జరిగిందనే అంశం ప్రశ్నగా మారింది.

కన్నెత్తి చూడని పోతుల
2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు నియోజకవర్గానికి దూరమయ్యారు. ఇప్పటి వరకు ఆయన కన్నెత్తి చూడలేదు. కందుకూరులో పార్టీ టికెట్‌ను దక్కించుకునేందుకు శతవిధాలా యత్నించి ఆయన భంగపాటుకు గురయ్యారు. దీంతో నాగేశ్వరరావుకు ఆయన సహకరిస్తారాననేది ప్రశ్నార్థకమే.

తగ్గేదేలే అంటున్న రాజేష్‌..
వరుస పరిణామాలతో డీలా పడిన ఇంటూరి నాగేశ్వరరావుకు తన కుటుంబానికే చెందిన ఇంటూరి రాజేష్‌ నుంచి సెగ ఎదురవుతోంది. నాగేశ్వరరావుకు టికెట్‌ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన పోటీగా ప్రచార కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించారు. ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ దిశగా తన కార్యక్రమాలను ముమ్మరం చేశారు. నాగేశ్వరరావు వ్యతిరేక వర్గాలను కలుపుకొంటూ.. తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. ఓట్లను చీల్చి తద్వారా నాగేశ్వరరావును ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మరోవైపు కందుకూరులో టీడీపీ అభ్యర్థిని మారుస్తారంటూ సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement
 
Advertisement