బాలిక మృతి కేసులో వీడని మిస్టరీ..? | - | Sakshi
Sakshi News home page

బాలిక మృతి కేసులో వీడని మిస్టరీ..?

Sep 10 2023 12:52 AM | Updated on Sep 11 2023 11:01 AM

- - Sakshi

బిట్రగుంట: బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలో గత నెల 30న అనుమానాస్పద స్థితిలో లభ్యమైన పదేళ్ల బాలిక మృతి కేసు మిస్టరీగా మారింది. పది రోజులు గడిచినా కేసు దర్యాప్తులో పురోగతి కనిపించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 30న వేకువన ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలో సముద్రంలో బాలిక మృతదేహాన్ని స్థానిక మత్స్యకారులు గుర్తించిన విషయం తెలిసిందే. బాలిక పెదవులు, మొహం నీలిరంగులో మారి ఉండడం, ముక్కు నుంచి నురగ వచ్చి ఉండడం మినహా ఎటువంటి దెబ్బలు, చేపలు కొరికిన గాయాలు లేకపోవడంతో ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే మృతదేహం వెలుగుచూసినట్లుగా భావించారు.

సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించి చేతులు దులుపుకొన్నారు. బాలిక ఎవరనేది తెలిస్తే మృతికి గల కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నా ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. జిల్లాతో పాటు సమీప జిల్లాల్లో నమోదైన మిస్సింగ్‌ కేసులు, వలస కార్మికుల వివరాలను కూడా పూర్తిస్థాయిలో పరిశీలించలేదనే విమర్శలు ఉన్నాయి. ఫిషింగ్‌ హార్బర్‌తో పాటు రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కూలీలు వచ్చి ఉన్నారు. వీరికి సంబంధించి కూడా ఎవరైనా కనిపించకుండా పోయారా అనే కోణంలో కూడా దర్యాప్తు ముందుకు సాగలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలిక ప్రమాదవశాత్తు సముద్రంలో పడి చనిపోతే తప్పనిసరిగా తల్లిదండ్రులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి ఉండేవారు.

ఎక్కడా మిస్సింగ్‌ కేసు నమోదవకపోవడం, బాలిక తల్లిదండ్రుల జాడా లేకపోవడంతో అంతా మిస్టరీగా మారింది. పోలీసులు ప్రాథమిక వివరాల పరిశీలనలో విఫలం కావడంతో పాటు సాంకేతిక ఆధారాల సేకరణకు ఎటువంటి ప్రయత్నాలు చేసినట్లుగా కనిపించడం లేదు. ఎక్కడో చనిపోతే ఇక్కడికి కొట్టుకొచ్చిందంటూ కేసును పక్కన పెట్టేసినట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై బిట్రగుంట ఎస్సై శేఖర్‌బాబును సంప్రదించగా మృతి చెందిన బాలికకు సంబంధించి ఇంకా ఎటువంటి వివరాలు లభ్యం కాలేదని తెలిపారు. రాష్ట్రంలో మిస్సింగ్‌ కేసులకు సంబంధించిన వివరాలు అన్నీ పరిశీలించినా ఎటువంటి సమాచారం సరిపోలేదన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తరువాత మృతికి కారణాలు తెలిసే అవకాశం ఉందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement