
జింబాబ్వే వేదికగా ముక్కోణపు టీ20 టోర్నమెంట్‌లో దక్షిణాఫ్రికా జట్టు రెండో విజయం నమోదు చేసుకుంది. హరారే వేదికగా ఆదివారం జరిగిన పోరులో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జింబాబ్వేను ఓడించింది. తద్వారా మరో రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఫైనల్లో అడుగుపెట్టింది.
145 పరుగులు
టాస్ గెలిచిన సౌతాఫ్రికా జింబాబ్వేను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఆతిథ్య జట్టు 144 పరుగులు చేసింది. బెనెట్ (61; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు)... ర్యాన్ బుర్ల్ (36 నాటౌట్) రాణించారు.
ఇక సఫారీ బౌలర్లలో కార్బిన్ బాష్ రెండు వికెట్లు పడగొట్టగా... నండ్రీ బర్గర్, లుంగి ఎంగిడి, పీటర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా.. 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది.
డసెన్ కెప్టెన్ ఇన్నింగ్స్
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రూబిన్ హెర్మాన్ (36 బంతుల్లో 63; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ రాసీ వాన్ డెర్ డసెన్ (41 బంతుల్లో 52 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధశతకాలు చేశారు.
కాగా జింబాబ్వేతో ముక్కోణపు టీ20 సిరీస్ ఆడేందుకు దక్షిణాఫ్రికాతో పాటు న్యూజిలాండ్ జట్టు కూడా అక్కడ పర్యటిస్తోంది. ఈ క్రమంలో టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన న్యూజిలాండ్ 4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది.
మరోవైపు... తాజా విజయంతో మూడు మ్యాచ్‌ల్లో రెండింట గెలిచిన దక్షిణాఫ్రికా 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఆతిథ్య జింబాబ్వే ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి ఫైనల్ రేసు నుంచి తప్పుకొంది. దీంతో మరో రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలుండగానే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ఫైనల్‌కు అర్హత సాధించాయి.
తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్- సౌతాఫ్రికా మంగళవారం (జూలై 22) తలపడతాయి. అనంతరం గురువారం (జూలై 24) జింబాబ్వే- న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో లీగ్ దశ ముగుస్తుంది. ఇక శనివారం (జూలై 26) న్యూజిలాండ్- దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్‌తో ఈ సిరీస్ ముగుస్తుంది.