WTC FInal 2023: రుత్‌రాజ్‌ గైక్వాడ్‌కు బంపరాఫర్‌.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ జట్టులో!

WTC FInal 2023: Ruturaj Gaikwad, Surya kumar yadav, mukesh kumar Indias standby players - Sakshi

ఐపీఎల్‌-2023లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా యువ ఓపెనర్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ బంపరాఫర్‌ తగిలింది.  ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జట్టులో స్టాండ్‌బై ప్లేయర్‌గా రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ను భారత సెలక్టర్లు ఎంపిక చేశారు. అతడితో పాటు పేసర్‌ ముఖేష్‌ కుమార్‌, సూర్యకుమార్‌ యాదవ్‌కు స్టాండ్‌బై జాబితాలో చోటు దక్కింది.

అదే విధంగా గాయం కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమైన కేఎల్‌ రాహుల్‌ స్థానంలో యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ను సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. ఈ మేరకు సోమవారం బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. కాగా డబ్ల్యూటీసీ తుదిపోరులో లండన్‌ వేదకగా జూన్‌ 7-11 వరకు టీమిండియా- ఆస్ట్రేలియా తలపడనున్న సంగతి తెలిసిందే.

సూపర్‌ ఫామ్‌లో రుతు
ఇక రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే ప్రాతినిధ్యం వహిస్తున్న రుత్‌రాజ్‌ దుమ్మురేపుతున్నాడు. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన అతడు 384 పరుగులు సాధించాడు. ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో ఏడో స్థానంలో ఉన్నాడు. కాగా  ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు స్టాండ్‌బైగా ఉన్న రుత్‌రాజ్‌.. ప్రధాన జట్టులో ఏ ఆటగాడైనా దూరమైతే అతడి స్థానాన్ని భర్తీ చేయనున్నాడు.

సూర్యకుమార్‌ యాదవ్‌
ఇక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీతో టెస్టు అరంగేట్రం చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌ తీవ్ర నిరాశ పరిచాడు. ఈ క్రమం‍లో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అతడి స్థానంలో వెటరన్‌ ఆటగాడు అజింక్యా రహానేను సెలక్టర్లు ఎంపికచేశారు. అయితే సూర్య తన ఫామ్‌ను తిరిగి పొందడంతో స్టాండ్‌బై ప్లేయర్‌గా సెలక్టర్లు ఎంపికచేశారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరపున ఆడుతున్న సూర్యకుమార్‌ పర్వాలేదనపిస్తున్నాడు.

ముఖేష్‌ కుమార్‌ 
బిహర్‌కు చెందిన పేసర్‌ ముఖేష్‌ కుమార్‌ గత కొన్ని సిరీస్‌లకు భారత జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికీ.. అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రావటం లేదు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన పేసర్లు ఉమేశ్‌ యాదవ్‌, శార్ధూల్‌ ఠాకూర్‌ ప్రస్తుతం గాయాలతో బాధపడుతున్నారు.

ఐపీఎల్‌-2023లో కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వీరిద్దరూ మోకాలి గాయంతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అందుబాటుపై సందిగ్ధం నెలకొంది. ఈ నేపధ్యంలోనే ముఖేష్‌ కుమార్‌ను స్టాండ్‌బై ప్లేయర్‌గా సెలక్టర్లు ఎంపికచేశారు.
చదవండి#WTC Final: రాహుల్‌ స్థానంలో యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. బీసీసీఐ ప్రకటన

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top