World Athletics Championships 2022: నిరాశపర్చిన అన్నూ రాణి.. ఆశలన్నీ గోల్డెన్ బాయ్‌పైనే

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్‌లో భారత్ బోణీ కొట్టేందుకు ఇంకా నిరీక్షించాల్సి ఉంది. ఏదో ఒక పతకం సాధిస్తుందని ఆశించిన మహిళా జావెలిన్ త్రోయర్ అన్నూ రాణి తాజాగా జరిగిన ఫైనల్స్‌లో ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చలేక ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఐదు ప్రయత్నాల్లో భాగంగా అన్నూ ఒకేసారి 60 మీటర్లకు పైగా (61.12) బళ్లాన్ని (జావెలిన్) విసరగలిగింది. తొలి ప్రయత్నంలో 56.18 మీటర్ల దూరాన్ని విసిరిన అన్నూ.. ఆతర్వాత నాలుగు ప్రయత్నాల్లో 61.12, 58.14, 59.98, 58.70 మీటర్ల దూరం మాత్రమే బళ్లాన్ని విసిరి నిరాశపర్చింది. ఫలితంగా ఏడో స్థానంతో సరిపెట్టుకుని మెగా ఈవెంట్ నుంచి రిక్త హస్తాలతో నిష్క్రమించింది.
ఫైనల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కెల్సీ లీ బార్బర్ (ఆస్ట్రేలియా) మరోసారి సత్తా చాటి (66.91 మీ) స్వర్ణం కైవసం చేసుకోగా.. అమెరికాకు చెందిన కారా వింగర్ (64.05) రజతం, జపాన్ త్రోయర్ హరుకా కిటగుచి (63.27) కాంస్య పతకాలు సాధించారు. ఇదిలా ఉంటే, ప్రపంచ ఛాంపియన్షిప్స్ లో అన్నూ రాణి పోరాటం ముగియడంతో భారత్ ఆశలన్నీ టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రాపైనే ఉన్నాయి. క్వాలిఫికేషన్స్‌లో నీరజ్ తొలి ప్రయత్నంలోనే ఏకంగా 88.39 మీటర్ల దూరం విసిరి తుది పోరుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. నీరజ్‌తో పాటు మరో భారత క్రీడాకారుడు రోహిత్ యాదవ్ కూడా 11వ స్థానంతో ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఫైనల్స్ జరుగుతాయి.
చదవండి: World Athletics Championship: పతకంపై ఆశలు!
మరిన్ని వార్తలు