
రూర్కెలా: ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్ (మహిళలు)లో భారత జట్టు పటిష్ట ఆస్ట్రేలియాపై ప్రతీకార విజయం సాధించింది. పది రోజుల క్రితం గత లీగ్ మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో ఓడిన భారత మహిళలు శనివారం సంచలన విజయాన్ని అందుకున్నారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో భారత్ 1–0 గోల్ తేడాతో ఆసీస్‌ను ఓడించింది.
భారత్ తరఫున ఏకైక గోల్‌ను 34వ నిమిషంలో వందన కటారియా సాధించింది. పెనాల్టీ కార్నర్ ద్వారా వచ్చిన ఈ అవకాశాన్ని భారత్ సమర్థంగా వాడుకోగలిగింది. భారత సీనియర్లు, జూనియర్లు సమష్టి ప్రదర్శనతో చెలరేగగా...ఆసీస్ బృందం పూర్తి తడబాటుతో వెనుకంజ వేసింది. 1996 తర్వాత భారత గడ్డపై ఆస్ట్రేలియాను భారత మహిళల జట్టు ఓడించడం ఇదే తొలిసారి కావడం విశేషం.