
లీగ్ దశలో జపాన్, వియత్నాం, చైనీస్ తైపీలతో టీమిండియా పోరు
వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో మహిళల ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నీ
సిడ్నీ: ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్‌సీ) మహిళల ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భారత జట్టుకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. వచ్చే ఏడాది ఆ్రస్టేలియాలో మార్చి 1 నుంచి 21 వరకు జరిగే ఈ టోర్నీలో ఆసియా ఘనాపాటి జపాన్ సహా మాజీ చాంపియన్లు చైనీస్ తైపీ, వియత్నాం జట్లున్న గ్రూప్ ‘సి’లో భారత అమ్మాయిల జట్టుకు చోటు దక్కింది. దీనికి సంబంధించిన ‘డ్రా’ వేడుక సిడ్నీ టౌన్ హాల్‌లో మంగళవారం అట్టహాసంగా జరిగింది. భారత స్టార్ మిడ్‌ఫీల్డర్ సంగీత బస్ఫొరె ప్రత్యేక ఆహ్వానితులుగా ‘డ్రా’ ఈవెంట్‌లో పాల్గొంది.
మొత్తం 12 ఆసియా జట్లను మూడు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో జట్టులో నాలుగేసి టీమ్‌లు తలపడతాయి. గ్రూప్ ‘సి’లో భారత అమ్మాయిల జట్టు తమ తొలి మ్యాచ్‌లో మార్చి 4న వియత్నాంతో... రెండో మ్యాచ్‌లో మార్చి 7న ప్రపంచ మాజీ చాంపియన్ జపాన్‌తో... మూడో మ్యాచ్‌లో మార్చి 10న చైనీస్ తైపీతో ఆడుతుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో జపాన్ 7వ స్థానంలో, వియత్నాం 37వ స్థానంలో, చైనీస్ తైపీ 42వ స్థానంలో, భారత్ 70వ స్థానంలో ఉన్నాయి.
సెమీస్ చేరితే ప్రపంచకప్ టోర్నీకి...
ఆసియా కప్ గ్రూప్ ‘ఎ’లో ఆతిథ్య ఆ్రస్టేలియా, దక్షిణ కొరియా, ఇరాన్, ఫిలిప్పీన్స్... గ్రూప్ ‘బి’లో డిఫెండింగ్ చాంపియన్ చైనా, ఉత్తర కొరియా, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్ జట్లున్నాయి. ఒక్కో గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అలాగే ఈ మూడు గ్రూప్‌ల్లో మెరుగైన మూడో స్థానం పొందిన రెండు జట్లు కూడా నాకౌట్‌కు క్వాలిఫై అవుతాయి.
ఈ 8 జట్ల మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్స్ విజేతలు అంటే సెమీఫైనల్ చేరిన నాలుగు జట్లు 2027లో బ్రెజిల్‌లో జరిగే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత పొందుతాయి. క్వార్టర్స్‌లో ఓడిన జట్లు ప్లే ఆఫ్స్ ఆడాల్సి ఉంటుంది. ఆసియా నుంచి మరో రెండు జట్లకు ప్రపంచకప్ బెర్త్‌లు లభిస్తాయి.