సిరాజ్- జైస్వాల్ (PC: BCCI)
గత కొంతకాలంగా టెస్టుల్లో టీమిండియా స్థాయికి తగ్గట్లు రాణించడం లేదు. ముఖ్యంగా గౌతం గంభీర్ హెడ్‌కోచ్‌గా వచ్చిన తర్వాత భారత్‌కు ఘోర పరాజయాలు ఎదురయ్యాయి. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఏకంగా 3-0తో వైట్‌వాష్‌కు గురైంది టీమిండియా.
ఇక ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని 3-2తో కోల్పోయింది. దాదాపుగా దశాబ్దకాలం తర్వాత టీమిండియా ఈ సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి. అనంతరం ఇంగ్లండ్ పర్యటనలో 2-2తో డ్రా చేసుకోవడంతో జట్టుపై విమర్శల జడి కాస్త తగ్గింది.
ఇదిలా ఉంటే.. చాన్నాళ్ల తర్వాత టీమిండియా టెస్టు బరిలో దిగనుంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టు ఆడనుంది. జూన్ 6 నుంచి ముల్లన్‌పూర్‌లో ఈ మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, ఈ మ్యాచ్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో భాగం కాదు.
భారత్‌కు అత్యంత ముఖ్యం
అయినప్పటికీ ఈ మ్యాచ్ భారత్‌కు అత్యంత ముఖ్యమని అంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ సబా కరీం. జియోస్టార్‌తో మాట్లాడుతూ.. ‘‘ఈ టెస్టు మ్యాచ్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగం కాదు. అయినప్పటికీ ఈ మ్యాచ్‌ను తేలికగా తీసుకోకూడదు.
టీమిండియాకు ఇది అతి ముఖ్యమైన మ్యాచ్. ఈ మ్యాచ్ ద్వారా తమ లోపాల్ని సరిచేసుకుని.. జట్టును పరీక్షించుకునే వీలు కలిగింది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటిని అధిగమించాల్సి ఉంది.
టెస్టు క్రికెట్‌పై భారత జట్టు మరింత దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా సొంతగడ్డపై గతంలో మాదిరి టీమిండియా పటిష్టంగా కనిపించడం లేదు’’ అని సబా కరీం అభిప్రాయపడ్డాడు.
యువ ఆటగాళ్లను పరీక్షించే అవకాశం
అదే విధంగా.. ‘‘అఫ్గన్‌తో టెస్టు రూపంలో యువ ఆటగాళ్లను కూడా పరీక్షించే అవకాశం వచ్చింది. కొత్త కొత్త కాంబినేషన్లు ప్రయత్నించండి. ఒకవేళ వాళ్లు బాగా ఆడితే తదుపరి సిరీస్‌లకు కూడా ఎంపిక చేయండిజ
ఇది ఇప్పటికప్పుడు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. అయితే, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొన్నిసార్లు ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. ఇది గెలుపోటముల గురించి ఆలోచించే సమయం కాదు. భవిష్యత్తును తప్పక దృష్టిలో పెట్టుకోండి’’ అని సబా కరీం సెలక్టర్లకు సూచించాడు.
అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టుకు భారత జట్టు
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవ్‌దత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, ధ్రువ్ జురెల్.


