
వియాన్ ముల్డర్‌పై నెటిజన్ల కామెంట్లు
‘‘ట్రిపుల్ సెంచరీ సంగతేమో గానీ డబుల్ సెంచరీ చేస్తానని కూడా కలలో అనుకోలేదు. లారా ఒక దిగ్గజం. 400 రికార్డుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ విషయంపై కోచ్‌తో చర్చించా. దిగ్గజాల పేరిటే అలాంటి రికార్డు ఉండటం సబబని భావించాం. ఆ ఘనత లారా పేరిట ఉండటమే సరైంది’’.. జింబాబ్వేపై త్రిశతకం బాదిన తర్వాత సౌతాఫ్రికా స్టార్ వియాన్ ముల్డర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. తనకు క్వాడ్రపుల్ సెంచరీ చేసే అవకాశం వచ్చినా.. లారా మీద గౌరవంతో మాత్రమే.. ఆ ఫీట్ జోలికి వెళ్లలేదని చెప్పాడతడు.
ఈ నేపథ్యంలో వియాన్ ముల్డర్‌పై క్రికెట్ ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు మాత్రం అతడిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. జింబాబ్వే లాంటి పసికూన మీద ట్రిపుల్ సెంచరీ బాదడం కాస్త సులువేనని.. అయినా.. 399 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తే దానిని త్యాగం అంటారు గానీ.. 367 వద్ద డిక్లేర్ చేయడం ఏమిటంటూ అతడి విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు.
తొలిసారి సౌతాఫ్రికా కెప్టెన్‌గా
ఇంతకీ విషయం ఏమిటంటే.. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిన్ నయా చాంపియన్ సౌతాఫ్రికా ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఆతిథ్య జట్టుపై తొలి టెస్టులో గెలిచిన ప్రొటిస్ జట్టు.. రెండో మ్యాచ్‌లోనూ ఇదే ఫలితం పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది.
ఇక ఈ టెస్టులో ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్ తొలిసారి సౌతాఫ్రికా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. బులవాయో వేదికగా టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ చేయగా.. సౌతాఫ్రికా ఐదు వికెట్ల నష్టానికి 626 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
కాగా సోమవారం నాటి రెండో రోజు ఆటను వియాన్ ముల్డర్ ఓవర్‌నైట్ స్కోరు 264తో మొదలు పెట్టాడు... రెండో రోజు మరో 38 బంతులు ఆడే సరికి అతడి ‘ట్రిపుల్ సెంచరీ’ పూర్తయింది... మరో 5 బంతుల తర్వాత దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో టాప్ స్కోరర్ రికార్డు సొంతమైంది...
ఆ తర్వాత మరిన్ని రికార్డుల వేట మొదలైంది... జోరు కొనసాగిస్తూ దిగ్గజాలను దాటుకుంటూ పోయాడు... సంగక్కర, వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, గూచ్, డాన్ బ్రాడ్‌మన్, మార్క్ టేలర్, హనీఫ్, జయసూర్య, గ్యారీ సోబర్స్... ఇలా అందరిని అధిగమించి టాప్–5లోకి వచ్చేశాడు. 367 పరుగులకు చేరాక లంచ్ విరామం వచ్చింది.
మరో 34 పరుగులు చేస్తే చాలు
ఇక తదుపరి లక్ష్యం బ్రియాన్ లారా 400 పరుగుల ఘనత... మరో 34 పరుగులు చేస్తే చాలు టెస్టు చరిత్రలో అతను శిఖరాన నిలిచిపోతాడు. కానీ దక్షిణాఫ్రికా శిబిరం నుంచి అనూహ్య ప్రకటన వచ్చింది. ఈ టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ముల్డర్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్లు తానే స్వయంగా ప్రకటించాడు. 367 పరుగులతో నాటౌట్‌గా తన ఇన్నింగ్స్‌ను ముగించాడు.
లారాను దాటకపోయినా... తన అద్భుత బ్యాటింగ్‌తో అతను ఎన్నో రికార్డులను తిరగరాశాడు. ఈ క్రమంలోనే లారా రికార్డును టచ్ చేయకూడదనే ఉద్దేశంతోనే తాను 400కు దూరంగా ఉన్నట్లు తెలిపాడు.
లారా ఒక్కడి మీదే గౌరవమా?.. అతడిది నిజంగా నిస్వార్థమేనా?
ఈ నేపథ్యంలో.. ‘‘ప్రతి ఒక్కరు వియాన్ ముల్డర్‌లా నిస్వార్థంగా ఉంటే.. ఈ ప్రపంచం ఎంతో బాగుండేది’’ అని కొంత మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం అతడు చేసిన పని తప్పు అని విమర్శిస్తున్నారు. ‘‘ఒకవేళ ముల్డర్ లారా పట్ల గౌరవం ప్రదర్శించాలని భావిస్తే.. 399 వరకు ఆడి అప్పుడు డిక్లేర్ చేయాల్సింది.
లారాను గౌరవిస్తున్నాడు సరే.. మరి హెడెన్, జయవర్దనే, సోబర్స్ ఇలా అందరినీ గౌరవించాలి కదా! అయినా ఆటల్లో రికార్డులు ఉన్నవే బద్దలు కొట్టడానికి కదా! అసాఫా పావెల్ కోసం ఉసేన్ బోల్ట్ నెమ్మదిగా పరిగెత్తలేడు..
ఏదేమైనా ఇక్కడ ప్రత్యర్థిని ఆడించి.. ఆలౌట్ చేసి గెలవాలంటే సౌతాఫ్రికాకు సమయం కావాలి. అందుకే ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. కానీ ముల్డర్ తానేదో త్యాగం చేస్తున్నట్లు చెప్పడం సరికాదు’’ అని ట్రోల్ చేస్తున్నారు.