నీ వల్లే ద్రవిడ్‌కు ఎప్పుడూ లేనంత కోపం వచ్చింది! ఆరోజు నేను సిక్స్‌ కొట్టడంతో.. | We Saw Dravid Got Angry Because Of You Ex IPL Star Narrates Sensational Story | Sakshi
Sakshi News home page

IPL: నీ వల్లే ద్రవిడ్‌కు ఎప్పుడూ లేనంత కోపం వచ్చింది! ఆరోజు నేను సిక్స్‌ కొట్టడం వల్లే...

May 18 2023 11:57 AM | Updated on May 18 2023 12:09 PM

We Saw Dravid Got Angry Because Of You Ex IPL Star Narrates Sensational Story - Sakshi

Mumbai Indians vs Rajasthan Royals 2014: ‘‘అప్పుడు నేను ద్రవిడ్‌ రియాక్షన్‌ చూడలేదు. కానీ ఆయన చాలా సీరియస్‌ అయ్యారని చాలా మంది చెప్పారు. నీ వల్లే రాహుల్‌ ద్రవిడ్‌కు ఎన్నడూ లేనంత కోపం వచ్చింది. ఆయనను మేము ఎప్పుడూ అలా చూడలేదు’’ అంటూ ముంబై వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఆదిత్య తారే 2014 నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు.

ముంబై తరఫున అరంగేట్రం
మహారాష్ట్రకు చెందిన ఆదిత్య 2010లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అడుగుపెట్టాడు. ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన అతడు.. అదే జట్టు మీద ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ తరఫున 2017లో ఆఖరి మ్యాచ్‌ ఆడాడు. తన కెరీర్‌లో మొత్తంగా ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 35 మ్యాచ్‌లు ఆడిన ఆదిత్య 339 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధ శతకం ఉంది.

కీలక పోరులో
ఇక ఆదిత్య తారే కెరీర్‌లో 2014 నాటి.. ముంబై ఇండియన్స్‌- రాజస్తాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌ తప్పక గుర్తుండిపోతుంది. ఆ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌, ముంబై మధ్య కీలక పోరు జరిగింది. వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.

అయితే, రన్‌రేటు దృష్ట్యా ఈ మ్యాచ్‌లో ముంబై సుమారు 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాల్సిన పరిస్థితి. లేనిపక్షంలో రాజస్తాన్‌ ప్లే ఆఫ్స్‌ చేరితే.. ముంబై ఇంటిబాట పట్టాల్సి వస్తుంది.


ఆదిత్య తారే, ద్రవిడ్‌ రియాక్షన్‌

ఆండర్సన్‌, రాయుడు విజృంభించడంతో
ఇలాంటి ఉత్కంఠభరిత స్థితిలో ముంబై ఇండియన్స్‌ ఓపెనర్లు లెండిల్‌ సిమ్మన్స్‌(12), మైకేల్‌ హస్సీ(22) పూర్తిగా నిరాశపరిచారు. ఈ క్రమంలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ కోరే ఆండర్సర్‌ తుపాన్‌ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. బౌండరీలు, సిక్సర్ల వర్షంతో 44 బంతుల్లోనే 95 పరుగులు చేసిన అతడు ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.

అంబటి రాయుడు(10 బంతుల్లో 30 పరుగులు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అతడికి సహకరించాడు. ఇక 15వ ఓవర్‌ మూడో బంతికి.. క్రీజులో ఉన్న ఆదిత్య తారే బౌండరీ కొడితే ముంబై ప్లే ఆఫ్స్‌ చేరడం ఖాయం. లేదంటే రాజస్తాన్‌ టాప్‌-4లో అడుగుపెడుతుంది.

నరాలు తెగే ఉత్కంఠ
నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఆ బంతికి ఆదిత్య ఏకంగా సిక్సర్‌ బాదడంతో ముంబై ఇండియన్స్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్స్‌ చేరుకుంది. అప్పటిదాకా ప్లే ఆఫ్‌ బెర్తు తమదే అని సంతోష పడ్డ రాజస్తాన్‌కు నిరాశ తప్పలేదు.

ఇక ఆదిత్య సిక్స్‌ కొట్టడంతో నాటి.. రాజస్తాన్‌ రాయల్స్‌ హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కోపంతో ఊగిపోయాడు. తమ జట్టు ఓడి ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించడంతో ఎన్నడూ లేని విధంగా సీరియస్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో కొత్తగా కనిపించాడు. ఈ విషయం గురించి తాజాగా స్టార్‌ స్పోర్ట్స్ షోలో ఆదిత్య తారే గుర్తు చేసుకున్నాడు.

అదే ద్రవిడ్‌ కోపానికి కారణం
‘‘నేను ఆ బంతిని గాల్లోకి లేపే ముందు తామే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించామని రాజస్తాన్‌ ఫిక్సైపోయింది. డగౌట్‌లో ఉన్న వాళ్ల ముఖాలు సంతోషంతో నిండిపోయాయి. అయితే, అప్పుడే మాకో విషయం తెలిసింది. మేము ప్లే ఆఫ్స్‌ చేరడానికి మాకు ఇంకో బంతి మిగిలే ఉంది.  

కాబట్టి బౌండరీ బాదాలని నిశ్చయించుకున్నాం. ముందేమో సిక్స్‌ కొట్టాలని భావించాం. తర్వాత తెలిసిందేంటే బౌండరీ బాదినా చాలని! అయితే, నేను అప్పటికే సిక్సర్‌ కొట్టాలని బలంగా నిశ్చయించుకున్నా. అదే అమలు చేశా. ఇదే ద్రవిడ్‌ కోపానికి కారణమైంది’’ అని 35 ఏళ్ల ఆదిత్య తారే చెప్పుకొచ్చాడు.

కాగా 2014లో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబై కథ ముగియగా.. కేకేఆర్‌ విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2023లో ఇప్పటికే డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ ప్లే ఆఫ్స్‌ బెర్తు ఖరారు చేసుకోగా.. మిగిలిన మూడు స్థానాల కోసం ఆరు జట్లు పోటీపడుతున్నాయి.

చదవండి: చిక్కుల్లో చెన్నై సూపర్ కింగ్స్.. కేసు నమోదు! ఎందుకంటే? 
గావస్కర్‌..సెహ్వాగ్‌ దగ్గరకు రాడు! వీరూనే వెళ్లాలి.. అర్థమైందా? వాళ్లిద్దరు అంతే! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement