Rohit Sharma- T20 Captaincy: టీ20 కెప్టెన్సీ నుంచి అతడికి విముక్తి కల్పించండి!

Virender Sehwag Says Relieving Rohit Sharma From T20 Captaincy May Help - Sakshi

రోహిత్‌ శర్మపై వీరేంద్ర సెహ్వాగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Rohit Sharma T20 Captaincy: టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ గురించి భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడికి టీ20 ఫార్మాట్‌ సారథ్య బాధ్యతల నుంచి విముక్తి కలిగించాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలికి సూచించాడు. అప్పుడు హిట్‌మ్యాన్‌పై భారం తగ్గి టెస్టు, వన్డేల్లో మరింత మెరుగ్గా కెప్టెన్సీ చేయగలడని అభిప్రాయపడ్డాడు.

వరుస సిరీస్‌లు గెలిచి!
కాగా టీ20 ప్రపంచకప్‌-2021 తర్వాత విరాట్‌ కోహ్లి టీమిండియా కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పగా రోహిత్‌ శర్మ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్వదేశంలో వరుస టీ20 సిరీస్‌లు గెలిచాడు. వన్డే సిరీస్‌లలోనూ విజయం సాధించాడు.

అయితే, దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్‌కు ముందు గాయం కారణంగా రోహిత్‌ జట్టుకూ దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ఇంతవరకు టీమిండియా తరఫున పూర్తి స్థాయి కెప్టెన్‌గా బరిలోకి దిగలేదు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న నేపథ్యంలో రీషెడ్యూల్డ్‌ టెస్టుతో సారథిగా తన ప్రయాణం ప్రారంభిస్తాడనుకున్నా కరోనా బారిన పడటం గమనార్హం.

టీ20 కెప్టెన్సీ నుంచి విముక్తి కల్పించండి!
ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2022లో రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ ఘోర పరాభవం మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఐదు సార్లు చాంపియన్‌ అయిన ఈ జట్టు తాజా సీజన్‌లో మాత్రం పాయింట్ల పట్టికలో అట్టడుగన నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో రోహిత్‌ టీ20 కెప్టెన్సీ గురించి సెహ్వాగ్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


వీరేంద్ర సెహ్వాగ్‌

ఈ మేరకు సెహ్వాగ్‌ సోనీ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘టీ20 ఫార్మాట్‌కు గనుక కొత్త కెప్టెన్‌ ఫలానా వ్యక్తి అని భారత క్రికెట్‌ జట్టు యాజమాన్యం మదిలో ఎవరి పేరైనా ఉంటే.. కచ్చితంగా రోహిత్‌ శర్మను రిలీవ్‌ చేయాలి.  తద్వారా.. ఒకటి.. రోహిత్‌పై పనిభారం తగ్గుతుంది.

ముఖ్యంగా తన వయసు దృష్ట్యా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇక రెండో విషయం ఏమిటంటే.. రోహిత్‌కు కావాల్సినంత విశ్రాంతి దొరుకుతుంది. తను పునరుత్తేజం పొందుతాడు. టెస్టులు, వన్డేల్లో మరింత దృష్టి సారించి జట్టును ముందుకు నడిపించగలుగుతాడు’’ అని చెప్పుకొచ్చాడు.
చదవండి: IND Vs IRE 1st T20: ‘గంటకు 208 కి.మీ. వేగం’.. వరల్డ్‌ రికార్డు బద్దలు కొట్టిన భువీ?! అక్తర్‌ ఎవరు?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top