IND vs AUS: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. సచిన్‌ ప్రపంచ రికార్డుపై కన్నేసిన కోహ్లి

Virat Kohli eyes Ricky Ponting, Sachin Tendulkar feats in ODI series - Sakshi

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు అదే జట్టుతో మూడు వన్డేల సిరీస్‌లో తలపడేందుకు సిద్దమైంది. మార్చి17(శుక్రవారం)న ముంబై వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఐపీఎల్‌-2023 ప్రారంభానికి ముందు భారత జట్టుకు ఇదే చివరి సిరీస్‌.

ఇక ఈ వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లిని పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్టులో విరాట్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. అద్భుతమైన సెంచరీతో చెలరేగిన కోహ్లి(186).. ఆఖరి టెస్టును డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు.

కోహ్లి ముందున్న రికార్డులు ఇవే..
ఈ సిరీస్‌లో కోహ్లి మరో 191 పరుగులు సాధిస్తే.. అంతర్జాతీయ  వన్డే క్రికెట్‌లో 13,000 పరుగులు పూర్తి చేసిన 5వ బ్యాటర్‌గా రికార్డులకెక్కుతాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో వరుసగా  సచిన్ టెండూల్కర్ (18426), కుమార సంగక్కర (14,234), రికీ పాంటింగ్ (13,704), సనత్ జయసూర్య (13,430) ఉన్నారు.

అదే విధంగా ఈ సిరీస్‌లో కోహ్లి మరో మూడు సెంచరీలు సాధిస్తే.. సచిన్ టెండూల్కర్ అత్యధిక వన్డే సెంచరీల(49) ప్రపంచరికార్డును సమం చేస్తాడు. కోహ్లి ఇప్పటివరకు వన్డేల్లో 46 సెంచరీలు సాధించాడు.

ఇక తొలి వన్డేలో విరాట్‌ 48 పరుగులు సాధిస్తే.. స్వదేశంలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ రికీ పాంటింగ్‌(5406)ను కోహ్లి అధిగమిస్తాడు. కోహ్లి ఇప్పటివరకు సొంత గడ్డపై వన్డేల్లో 5358 పరుగులు చేశాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో టీమిండియా క్రికెట్‌ దిగ్గజం  సచిన్ టెండూల్కర్(6976) పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు.
చదవండి: IPL 2023: కొత్త సీజన్‌.. కొత్త కెప్టెన్‌.. సన్‌రైజర్స్‌ కొత్త జెర్సీ అదిరిపోయిందిగా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top