ఐపీఎల్‌ను తాకిన ఇళయదళపతి ఫీవర్‌ | Vijay Fever Reaches IPL 2026 As RCB Star Pays Tribute With Fifty Celebration | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ను తాకిన ఇళయదళపతి ఫీవర్‌

May 18 2026 8:18 AM | Updated on May 18 2026 9:01 AM

Vijay Fever Reaches IPL 2026 As RCB Star Pays Tribute With Fifty Celebration

గత కొద్ది రోజులుగా పొలిటికల్‌ సర్కిల్స్‌ను పట్టుకున్న తమిళనాడు సీఎం జోసఫ్‌ విజయ్‌ ఫీవర్‌ ఇప్పుడు ఐపీఎల్‌కూ పాకింది. తాజాగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌ ఇళయదళపతి స్టయిల్‌లో తన హాఫ్‌ సెంచరీ సెలబ్రేషన్స్‌ చేసుకొని వైరలయ్యాడు. 

ఈ మ్యాచ్‌లో 40 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 73 పరుగులు చేసి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించిన అయ్యర్‌, ఫిఫ్టీ పూర్తి చేసిన అనంతరం విజయ్‌ నటించిన Mersal సినిమాలో పాపులర్‌ పోజ్‌ను అనుకరించాడు. 

ఇది చూసి విజయ్‌ అభిమానులు సంబరపడిపోతున్నారు. తమ ఆరాధ్య నటుడు, నాయకుడి క్రేజ్‌ ఐపీఎల్‌కు కూడా పాకిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయ్యర్‌ విజయ్‌ స్టయిల్‌ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల​్‌మీడియాలో వైరలవుతోంది.

ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో పంజాబ్‌పై విజయం సాధించడంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. ఈ సీజన్‌లో ఫైనల్‌-4కు చేరిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ స్థానంలో వెంకటేశ్‌ అయ్యర్‌ బరిలోకి దిగాడు. రజత్‌ గాయపడటంతో అయ్యర్‌కు ఈ అవకాశం వచ్చింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. అయ్యర్‌తో పాటు విరాట్‌ కోహ్లి (58), పడిక్కల్‌ (45), టిమ్‌ డేవిడ్‌ (28) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌ 8 వికెట్ల నష్టానికి 199 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ సీజన్‌ తొలి 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించిన పంజాబ్‌.. ఆతర్వాతి 6 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, నిష్క్రమణ అంచుల్లో నిలిచింది.

ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఆదిలోనే పట్టు కోల్పోయింది. భువనేశ్వర్‌ కుమార్‌ ధాటికి  19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓ దశలో శశాంక్‌ సింగ్‌ (56), స్టోయినిస్‌ (37) పంజాబ్‌ శిబిరంలో ఆశలు రేకెత్తించారు. వీరు కూడా ఔట్‌ కావడంతో పంజాబ్‌ ఓటమి ఖరారైంది. ఆర్సీబీ బౌలర్లలో రసిక్‌ సలాం దార్‌ 3, భువీ 2, హాజిల్‌వుడ్‌, సుయాశ్‌ శర్మ, షెపర్డ్‌ తలో వికెట్‌ తీశారు.

Advertisement
 
Advertisement
Advertisement