‘టీమిండియా ఏదీ గెలవదు’

Vaughan Feels India Will Lose To Australia In All Formats - Sakshi

లండన్‌: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియాకు ఘోర పరాభవం తప్పదని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ వ్యంగ్యస్త్రాలు సంధించాడు. ఆసీస్‌పై టీమిండియా ఏ సిరీస్‌ను గెలుచుకునే అవకాశమే లేదని ఎద్దేవా చేశాడు. ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్‌ ఓటమి చెందడాన్ని ప్రస్తావిస్తూ మిగతా మ్యాచ్‌ల్లో కూడా ఇదే రిపీట్‌ అవుతుందని విమర్శించాడు. పేలవమైన ఫీల్డింగ్‌, సాధారణ బౌలింగ్‌తో ఆసీస్‌పై సిరీస్‌లను గెలవలేదన్నాడు. ఈ మేరకు ట్వీటర్‌ వేదికగా వాన్‌ స్పందించాడు. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న ఆసీస్‌ తొలి వన్డేలోనే తన సత్తా చూపిట్టిందన్నాడు. ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో  ఆసీస్‌దే పైచేయి అవుతుందని జోస్యం చెప్పాడు.  ప్రస్తుత ఆసీస్‌ పర్యటనలో కోహ్లి గ్యాంగ్‌కు చుక్కెదరవడం ఖాయమన్నాడు. ఇప్పటికీ టీమిండియా ఐదుగురు  స్పెషలిస్టు బౌలర్ల గురించి ఆలోచించడం ఆ జట్టు ఇంకా ‘ ఓల్డ్‌ స్కూల్‌’లో ఉన్నట్లే కనబడుతుందన్నాడు. ఐదుగురు స్పెషలిస్టు బౌలర్లతో ఆడితే కింది స్థాయిలో తగినంత బ్యాటింగ్‌ ఉండదనే విషయాన్ని తెలుసుకోవాలన్నాడు. (ఆ మూడు తప్పిదాలతోనే టీమిండియా మూల్యం!)

కరోనా కారణంగా తొమ్మిదినెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన టీమిండియా..ఆస్ట్రేలియా గడ్డపై ఎన్నో ఆశలతో అడుగుపెట్టింది. కాగా, టీమిండియా తొలి వన్డేలో ఘోర పరాభవాన్ని చవిచూసింది. బ్యాటింగ్‌లో కాస్త ఫర్వాలదేనిపించిన భారత్‌.. బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోయింది. ఇక ఫీల్డింగ్‌ తప్పిదాలతో ఆసీస్‌ 374 పరుగుల రికార్డు స్కోరును సాధించింది.  ఫించ్‌, స్మిత్‌లు శతకాలు బాదారు. ఇది ఆసీస్‌కు వన్డేల్లో భారత్‌పై అత్యధిక స్కోరు. కాగా, టీమిండియా బ్యాటింగ్‌లో హార్దిక్‌(90), శిఖర్‌ ధావన్‌(74)లు రాణించినా మిగతా వారు ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో టీమిండియా 66 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. (అది ఆసీస్‌ జట్టు..ఇలా అయితే ఎలా?: కోహ్లి అసహనం)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top