ఆ మూడు తప్పిదాలతోనే టీమిండియా మూల్యం! | 3 Captaincy Blunders By Virat Kohli | Sakshi
Sakshi News home page

ఆ మూడు తప్పిదాలతోనే టీమిండియా మూల్యం!

Nov 27 2020 7:43 PM | Updated on Nov 28 2020 4:56 AM

3 Captaincy Blunders By Virat Kohli - Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనకు ఎంతో ఉత్సాహంగా వెళ్లినా టీమిండియాకు తొలి మ్యాచ్‌లోనే చుక్కెదురైంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ 308 పరుగులకే పరిమితమై 66 పరుగుల తేడాతో ఓటమి చెందింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 374 పరుగుల భారీ స్కోరు సాధించింది. వన్డేల్లో భారత్‌పై ఆసీస్‌కు ఇదే అత్యధిక స్కోరు. కాగా, టీమిండియా పోరాడిందనే చెప్పాలి. ఒక దశలో ఆసీస్‌ బౌలర్లకు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా చుక్కలు చూపించాడు. కానీ 76 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 90 పరుగులు సాధించిన హార్దిక్‌.. సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడానికి కొన్ని ప్రధాన కారణాలు కనబడుతున్నాయి. ప్రధానంగా మూడు తప్పిదాలు టీమిండియా ఓటమిని శాసించాయి. (తొలి వన్డే ఆసీస్‌దే..)

1 సైనీకి చోటు కల్పించడం..
ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో నవదీప్‌ సైనీని తుది జట్టులో వేసుకుని తప్పుచేసినట్లే కనబడింది. సైనీ పేస్‌ బౌలింగ్‌లో ఎక్కువ వేగం ఉంటుంది.. తప్పితే నియంత్రణ ఉండదు. అది ఐపీఎల్‌లో కనబడింది. పలు మ్యాచ్‌ల్లో సైనీ భారీ పరుగులు కూడా సమర్పించుకున్నాడు. దాంతో ఆసీస్‌ వంటి పటిష్టమైన జట్టు ముందు, అందులోనూ తొలి వన్డేకు సైనీ చాన్స్‌ ఉండదనే విశ్లేషకులు భావించారు.  కానీ సైనీ జట్టులోకి తీసుకోవడానికే కోహ్లి మొగ్గుచూపాడు. నియంత్రణతో కూడిన బౌలింగ్‌తో పాటు కచ్చితమైన యార్కర్లు వేసే నటరాజన్‌ను అవకాశం దక్కుతుందని అంతా భావించినా, చివరకు సైనీ జట్టులోకి రావడం ఆశ్చర్య పరిచడమే కాకుండా కొంపముంచింది. సైనీ ఏకంగా 83 పరుగులు సమర్పించుకున్నాడు. వికెట్‌ మాత్రమే సాధించిన సైనీని ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఆడేసుకున్నారు.  నటరాజన్‌తో పాటు శార్దూల్‌ ఠాకూర్‌ కూడా మూడో పేసర్‌గా అందుబాటులో ఉన్న సమయంలో సైనీపై నమ్మకం ఉంచాడు కోహ్లి.  ఈ ప్లాన్‌ రివర్స్‌ అయ్యింది. 

2. ఫీల్డింగ్‌ ప్లేస్‌మెంట్‌లో విఫలం
ఆసీస్‌ భారీ పరుగులు చేయడానికి ఫీల్డింగ్‌లో తప్పిదాలు కూడా ప్రధాన కారణం. మ్యాచ్‌లో ఎప్పుడూ ఫీల్డింగ్‌ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది. కానీ కోహ్లి ఫీల్డింగ్‌ ఆకట్టుకోలేదు. ఫించ్‌, స్మిత్‌లు గ్యాప్‌లు చూసుకుని మరీ పరుగులు సాధించినా దానికి ఫుల్‌స్టాప్‌ పెట్టలేకపోయారు. ఓవరాల్‌గా ఫీల్డింగ్‌లో ఆది నుంచి కడవరకూ టీమిండియా వైఫల్యం కనబడింది. అదే ఫించ్‌, స్మిత్‌లు సెంచరీ చేయడానికి కారణమైంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమైన కింగ్స్‌ పంజాబ్‌ ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ సైతం బౌండరీలు సాధించాడంటే ఇక్కడ మన ఫీల్డింగ్‌ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కేవలం ఇన్‌సైడ్‌ సర్కిల్‌లోనే ఫీల్డింగ్‌తోనే భారత్‌ భారీ పరుగులు ఇచ్చింది. అదే ఓటమికి మరో కారణం కూడా.  

3. కోహ్లి తొందరపాటు
స్కోరు బోర్డుపై భారీ పరుగులు ఉండటంతో విరాట్‌ కోహ్లి వచ్చీ రాగానే బంతిని హిట్‌ చేయాలని భావించాడు. పిచ్‌ పరిస్థితిని అర్థం చేసుకోకుండానే హిట్టింగ్‌కు దిగాడు. ఈ క్రమంలోనే కోహ్లి ఒక లైఫ్‌ లభించింది. కమిన్స్‌ వేసిన ఏడో ఓవర్‌లో కోహ్లి భారీ షాట్‌ ఆడాడు. అది పూర్తిగా మిడిల్‌ కాకపోవడంతో అది కాస్తా గాల్లోకి లేచింది. కాగా, ఫైన్‌లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న ఆడమ్‌ జంపా దాన్ని వదిలేయడంతో కోహ్లి ఊపిరి పీల్చుకున్నాడు. అప్పుడు కోహ్లి స్కోరు పరుగు మాత్రమే. ఆ తర్వాత కాసేపటికి హజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో మళ్లీ రిస్కీ షాట్‌ ఆడాడు. ఈసారి కోహ్లికి చాన్స్‌ ఇవ్వలేదు ఆసీస్‌ ఫీల్డర్లు. ఫించ్‌ క్యాచ్‌ పట్టడంతో కోహ్లి ఇన్నింగ్స్‌ 21 పరుగుల వద్ద ముగిసింది. కోహ్లి ఇలా తొందరగా పెవిలియన్‌ చేరడంతో హార్దిక్‌ పాండ్యా- ధావన్‌ల పోరాటం వృథానే అయ్యిందనే చెప్పాలి. తదుపరి మ్యాచ్‌కైనా తుది జట్టు కూర్పు, ఫీల్డింగ్‌ తదితర అంశాలపై టీమిండియా కసరత్తు చేస్తేనే తిరిగి రేసులోకి వస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement