
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ నాకౌట్ చెస్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. వంతిక అగర్వాల్, పద్మిని రౌత్, పీవీ నందిత రెండో రౌండ్‌లోకి ప్రవేశించగా... కిరణ్ మనీషా మొహంతి తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. కె.ప్రియాంక భవిత్యం నేడు జరిగే టైబ్రేక్ గేమ్‌లలో తేలనుంది. తొలి రౌండ్‌లో వంతిక 1.5–0.5తో లాలా షొహోర్దోవా (తుర్క్‌మెనిస్తాన్)పై, పద్మిని 2–0తో జాంగ్ లాన్‌లిన్ (చైనా)పై, నందిత 2–0తో ఒరిట్జ్ అనాహి (ఈక్వెడార్)పై గెలుపొందారు.
కిరణ్ మనీషా 0.5–1.5తో సాంగ్ యుజిన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. తొలి రౌండ్‌లోని రెండు గేమ్‌లు ముగిశాక ప్రియాంక–గాల్ జొసోకా (హంగేరి) 1–1తో సమంగా నిలిచారు. షొహోర్దోవాతో ఆదివారం తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న వంతిక సోమవారం జరిగే రెండో గేమ్‌లో 29 ఎత్తుల్లో నెగ్గింది.
జాంగ్ లాన్‌లిన్‌పై తొలి గేమ్‌లో గెలిచిన పద్మిని సోమవారం జరిగిన రెండో గేమ్‌లో 34 ఎత్తుల్లో... అనాహిపై తొలి గేమ్‌లో నెగ్గిన నందిత రెండో గేమ్‌లో 64 ఎత్తుల్లో విజయం అందుకున్నారు. సాంగ్ యుజిన్ చేతిలో తొలి గేమ్‌లో ఓడిపోయిన మనీషా రెండో గేమ్‌ను 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని ఇంటిదారి పట్టింది.