బోల్ట్‌కు కరోనా

Usain Bolt Tested Positive For Coronavirus - Sakshi

మహమ్మారి బారిన దిగ్గజ అథ్లెట్‌

పుట్టిన రోజు వేడుకల్లో నిబంధనలు పాటించని ఒలింపిక్‌ చాంపియన్‌  

కింగ్‌స్టన్‌: అథ్లెట్‌ దిగ్గజం, ఎనిమిదిసార్లు ఒలింపిక్‌ చాంపియన్‌ ఉసేన్‌ బోల్ట్‌కు కరోనా వైరస్‌ సోకింది. దాంతో తన స్వగృహంలో ఐసోలేషన్‌లో ఉన్నట్లు అతను సోషల్‌ మీడియాలో తెలిపాడు. ట్రాక్‌లపై చిరుతలా పరుగెత్తే బోల్ట్‌ ఇప్పుడు క్వారంటైన్‌లో ఉన్నాడు. ఇటీవల అత్యంత సన్నిహితులు, క్రీడాతారల మధ్య ఈనెల 21వ తేదీన తన 34వ పుట్టిన రోజు వేడుక జరుపుకున్న ఈ జమైకన్‌ స్టార్‌ ఆ వేడుకల్లో కరోనా వైరస్‌ నియంత్రణకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఆ పార్టీలో పాల్గొన్నవారంతా ఏమాత్రం భౌతిక దూరం పాటించకుండా... మాస్క్‌ కూడా ధరించకుండానే చిందులేసినట్లు ఫొటో ల్లో  స్పష్టంగా కనిపించింది. దాంతో రోజుల వ్యవధిలో అతను ఈ మహమ్మారి బారిన పడ్డాడు. కోవిడ్‌–19 టెస్టులో తనకు పాజిటివ్‌ ఫలితం వచ్చినట్లు తెలిపాడు. కరోనా సోకడంతో బాధ్యతగల పౌరుడిగా స్వీయ నిర్బంధంలో ఉన్నానని చెప్పాడు. 100, 200 మీటర్ల విభాగాల్లో ప్రపంచ రికార్డులు తన పేరిట లిఖించుకున్న బోల్ట్‌ ఒలింపిక్స్‌లో ఎనిమిది స్వర్ణాలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 11 స్వర్ణాలు సాధించాడు. 2017లో  కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.  

గేల్‌ బయటపడ్డాడు... 
బోల్ట్‌ పార్టీలో ఆడి పాడిన వారిలో వెస్టిండీస్‌ డాషింగ్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ కూడా ఉన్నాడు. అయితే అథ్లెట్‌ స్టార్‌కు కోవిడ్‌ సోకడంతో తను త్వరపడ్డాడు. వెంటనే కరోనా పరీక్ష చేయించుకున్నాడు. అందులో నెగెటివ్‌ ఫలితం రావడంతో ఊపిరి పీల్చుకున్నాడు. అతను త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్‌ టోర్నీ కోసం యూఏఈ బయల్దేరాల్సి ఉంది. ఇప్పుడు నెగెటివ్‌ వచ్చినా మరో రెండు టెస్టుల్లోనూ అదే ఫలితం రావాలి. అప్పుడే ఐపీఎల్‌ ఆడేందుకు అర్హుడు. అయితే కోవిడ్‌ నెగెటివ్‌ విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్న గేల్‌ ఈ 2020లో ఇంటిపట్టునే ఉంటానని ఎక్కడికీ ప్రయాణం చేయబోనని పోస్ట్‌ చేశాడు. గేల్‌ ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top