T20 World Cup 2021: సెమీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు అతి భారీ షాక్..

Tymal Mills Ruled Out Of T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్-2021 కీలక దశకు ముందు ఇంగ్లండ్ జట్టుకు అతి భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ తైమాల్ మిల్స్ గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. సోమవారం(నవంబర్ 1) శ్రీలంకతో మ్యాచ్‌లో 1.3 ఓవర్లు వేసిన మిల్స్.. తొడ కండరాలు పట్టేయడంతో మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. స్కానింగ్‌లో గాయం తీవ్రమైందిగా తేలడంతో అతను టోర్నీ నుంచి వైదొలుగుతాడని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) బుధవారం ప్రకటించింది.
దీంతో ఈసీబీ అతని స్థానాన్ని రీస్ టాప్లేతో భర్తీ చేసింది. ఈ టోర్నీలో ఇంగ్లండ్ ఆడిన 4 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగిన మిల్స్.. 15.42 సగటుతో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుత మెగా టోర్నీలో మోర్గాన్ సేన సూపర్ ఫామ్‌లో కొనసాగుతుంది. ఆడిన 4 మ్యాచ్‌ల్లోనూ భారీ విజయాలు సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. టోర్నీలో ఇంగ్లండ్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇంగ్లీష్ జట్టు నవంబర్ 6న దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
చదవండి: పసికూనపై మార్టిన్ గప్తిల్ ప్రతాపం.. పలు రికార్డులు సొంతం