కివీస్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ సంచలన నిర్ణయం.. మొయిన్‌ అలీ బాటలోనే..!

Trent Boult Commits To Play 2023 WC Despite Declining NZ Central Contract - Sakshi

న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌ 2023 కోసం న్యూజిలాండ్‌ జట్టులో చేరేందుకు అంగీకరించాడు. గతేడాది ఆగస్ట్‌లో న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు (NZC) సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ వదులుకున్న బౌల్ట్‌.. బోర్డు విజ్ఞప్తి మేరకుతో మళ్లీ కివీస్‌ తరఫున బరిలోకి దిగేందుకు ఓకే చెప్పాడు. న్యూజిలాండ్‌ ప్రజలు బోల్ట్‌ను వన్డే వరల్డ్‌కప్‌-2023 జట్టులోకి తీసుకోవాలని బోర్డుపై ఒత్తిడి తేవడంతో NZC ఈ నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్‌ బోర్డు 20 మంది ఆటగాళ్లకు 2023-24 సీజన్‌ సెంట్రల్‌ కాంట్రక్ట్‌ ఇచ్చిన రోజే (జూన్‌ 8) ఈ పరిణామం చోటు చేసుకుంది. 

కాగా, బౌల్ట్‌.. ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్‌ల్లో పాల్గొనేందుకు, అలాగే కుటుంబంతో గడిపేందుకు గతేడాది న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు కాంట్రాక్ట్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే. 2015, 2019 వన్డే వరల్డ్‌కప్‌లలో  అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన బౌల్ట్‌.. 2023 వరల్డ్‌కప్‌లో కూడా న్యూజిలాండ్‌ జట్టులో భాగం కావాలని ఆ దేశ ప్రజలు కోరుకున్నారు. చివరి రెండు వరల్డ్‌కప్‌లలో న్యూజిలాండ్‌ ఫైనల్స్‌కు చేరడంలో బౌల్ట్‌ కీలకపాత్ర పోషించాడు.

2015లో ఆసీస్‌ మిచెల్‌ స్టార్క్‌తో పాటు లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా (22).. 2019లో న్యూజిలాండ్‌ తరఫున అత్యుత్తమ బౌలర్‌గా (8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) నిలిచాడు. ఓవరాల్‌గా బౌల్ట్‌ వరల్డ్‌కప్‌లలో 21.79 సగటున 39 వికెట్లు పడగొట్టి, ఆ దేశం తరఫున మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టన బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. 

ఇదిలా ఉంటే, నిన్న (జూన్‌ 7) ఇంగ్లండ్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ సైతం తన దేశ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) విజ్ఞప్తి మేరకు రిటైర్మెంట్‌ ప్రకటించాక కూడా టెస్ట్‌ల్లో ఆడేందుకు ఒప్పుకున్నాడు. ఈసీబీ మొయిన్‌ అలీని యాషెస్‌ సిరీస్‌కు ఎంపిక చేసింది. దీంతో మొయిన్‌ దాదాపు రెండేళ్ల తర్వాత టెస్ట్‌ల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. మొయిన్‌ 2021లో టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పాడు.

చదవండి: ఇంగ్లండ్‌ క్రికెటర్‌ మొయిన్‌ అలీ సంచలన నిర్ణయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top