Tokyo Paralympics: సాహో జెంగ్‌ టావో.. చేతులు లేకపోయినా 4 బంగారు పతకాలు గెలిచాడు

Tokyo Paralympics 2021: Chinese Para Swimmer Zheng Tao No Arms Picks FOURTH Gold Medal - Sakshi

టోక్యో: ఆత్మ విశ్వాసం ముందు.. వైకల్యం తలవంచక తప్పదని చైనా స్విమ్మర్ జెంగ్‌ టావో నిరూపించాడు. టోక్యో వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌లో  చైనా స్విమ్మర్ రికార్డులు సృష్టించాడు. ఆ దేశానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు బంగారు పతకాలు సాధించి పెట్టాడు. స్విమ్మింగ్‌లో కాళ్లతో పాటు చేతులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాంటిది పూర్తిగా రెండు చేతులు లేని స్విమ్మర్ జెంగ్‌ టావో నాలుగు బంగారు పతకాలు సాధించి క్రీడా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాడు. 

అంతకముందు రియో పారాలింపిక్స్‌లో రెండు పతకాలు, 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో మూడు పతకాలు జెంగ్‌ టావో సాధించాడు.  చిన్నతనంలో విద్యుదాఘాతానికి గురై రెండు చేతులు కోల్పోయిన జెంగ్‌ టావో.. అంగవైకల్యం శరీరానికే కాని, మనస్సుకు కాదని... లక్ష్యంతో ముందుకు వెళ్లిన తీరు స్ఫూర్తిదాయకం. ఈ రోజు  ప్రపంచ చరిత్రలో తన పేరును లిఖించుకుని అతడు అద్భుతమే చేశాడు.

బుధవారం జరిగిన 50 మీటర్ల ఫ్రీస్టైల్ ఫైన్‌ల్‌లో విజయం సాధించగానే.. చైనీయులు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఎందుకంటే 1984 న్యూయార్క్ పారాలింపిక్స్‌లో మొదలైన చైనా బంగారు పతకాల పంట నేటికి 500 కు చేరింది. ఆనతరం  మీడియా సమావేశంలో  భావోద్వేగానికి గురైన  జెంగ్‌ టావో... ‘‘నా చిట్టితల్లీ.. చూడు  నాకు రెండు చేతులు లేనప్పటికీ నేను చాలా వేగంగా ఈత కొట్టగలను’’ అంటూ తన కుమార్తెకు వీడియో సందేశాన్ని పంపాడు. 

నివేదికల ప్రకారం.. జెంగ్ టోక్యో పారాలింపిక్స్‌ సన్నద్ధమయ్యే క్రమంలో ప్రతిరోజూ కనీసం 10 కిలోమీటర్లు ఈత కొడుతూ ప్రాక్టీస్‌ చేసేవాడు. కాగా జెంగ్‌ టావో 13 సంవత్సరాల వయస్సులో స్విమ్మింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. ఈ క్రమంలో  పందొమ్మిదేళ్ల వయస్సులో నెదర్లాండ్స్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటిల్లో అరంగేట్రం చేశాడు. తరువాత 2012 లండన్ పారాలింపిక్స్‌లో 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్‌లో తన మొదటి పారాలింపిక్ స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. ఇప్పటి వరకు తొమ్మిది పారాలింపిక్ పతకాలు జెంగ్‌ టావో  సాధించాడు.

చదవండి: Lora Webster: 5 నెలల గర్భంతో 5వ పతకం వేటలో..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top