Chak De India: గర్వంగా ఉంది.. ఇలాగే ఆడుతూ ఫైనల్‌కు వెళ్లి..

Tokyo Olympics: Netizens Praises Indian Women Hockey Team In Semis - Sakshi

న్యూఢిల్లీ: భారత మహిళా హాకీ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించిన రాణి సేనపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌ క్వార్టర్స్‌లో గెలుపొంది... తొలిసారిగా సెమీస్‌ చేరిన క్రమంలో యావత్‌ భారతావని మహిళా హాకీ జట్టును కీర్తిస్తోంది. ఇక ప్రపంచ నంబర్‌ 2 ఆస్ట్రేలియాపై పూర్తిస్థాయి ఆధిపత్యం కనబరుస్తూ అద్వితీయ విజయం సొంతం చేసుకున్న తీరుపై నెటిజన్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

‘‘చక్‌ దే ఇండియా’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత జట్టు సభ్యుల భావోద్వేగాలను ప్రతిబింబించే వీడియోలు షేర్‌ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇలాగే అద్భుతంగా ఆడుతూ ఫైనల్‌ చేరి.. స్వర్ణం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర క్రీడా శాఖా మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, న్యాయ శాఖా మంత్రి కిరణ్‌ రిజిజు సహా పలువురు రాజకీయ, సినీ సెలబ్రిటీలు భారత మహిళా హాకీ జట్టుకు అభినందనలు తెలియజేస్తున్నారు.

130 కోట్ల మంది భారతీయులు మీ వెన్నంటే!
‘‘అద్భుతమైన ప్రదర్శన!!! టోక్యో ఒలింపిక్స్‌-2020లోభాగంగా భారత మహిళా హాకీ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాను ఓడించి సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది. 130 కోట్ల మంది భారతీయులు.. ‘‘మీ వెన్నంటే మేమున్నాం’’ అని చెబుతున్నాం’’ అని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ట్వీట్‌ చేశారు. 

కల నెరవేరింది!
‘‘భారత్‌ కల నెరవేరింది. ఆస్ట్రేలియాను భారత మహిళా హాకీ జట్టు ఓడించింది! టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల, మహిళా హాకీ జట్లు సెమీ ఫైనల్‌ చేరడం గొప్ప విషయం. ఈ సంతోషాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదు’’ అని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ట్విటర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. 

ఇంకొంత ఆలస్యమవుతుంది మరి! 
భారత మహిళా హాకీ జట్టు విజయంతో ప్రధాన కోచ్‌ జోర్డ్‌ మారిజ్నే సంతోషంలో తేలిపోతున్నారు. ఇన్నాళ్ల శ్రమకు సెమీ ఫైనల్‌లో ప్రవేశం రూపంలో ఫలితం దొరకడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మ్యాచ్‌ గెలిచిన అనంతరం.. భారత మహిళా హాకీ జట్టుతో ఉన్న ఫొటోను పంచుకున్న జోర్డ్‌.. ‘‘ఇంటికి రావడం మరింత ఆలస్యం అవుతుంది కదా! నన్ను క్షమించండి కుటుంబ సభ్యులారా!’’ అంటూ తన ఫ్యామిలీని ఉద్దేశించి సరదాగా ట్వీట్‌ చేశారు.

ఇక హాకీ ఇండియా సైతం.. సోమవారం నాటి 60 నిమిషాల ఆట చిరస్మరణీయం అంటూ వుమెన్‌ ఇన్‌ బ్లూను ప్రశంసించింది. అదే విధంగా భారత క్రీడా మంత్రిత్వ శాఖ.. ‘‘భావోద్వేగాలు ఉప్పొంగుతున్నాయి! అంతా నీలమయం అయ్యింది! అమ్మాయిలూ.. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది!’’అంటూ అభినందనలు తెలుపుతూ ఓ వీడియోను షేర్‌ చేసింది.  

ప్రధాని మోదీ అభినందనలు
భారత హాకీ జట్లకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల, మహిళల హాకీ జట్టు సెమీస్‌కు చేరిన నేపథ్యంలో.. కొత్త చరిత్ర సృష్టిస్తున్నారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

v

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top