కోచ్‌ చెప్పిన మాటలు గుర్తు చేసుకున్న ‘వాల్‌’ సవిత

Tokyo Olympics: Indian Hockey Goalkeeper Savita Punia Recalls Coach Words - Sakshi

వాళ్లకు ఆ మూవీ చూడమని చెప్పాను: కోచ్‌

టోక్యో: ‘‘సమిష్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నాం. మా చేతుల్లో ఉన్నది 60 నిమిషాల సమయం. దానిని సద్వినియోగం చేసుకునేందుకు 100 శాతం శ్రమించాలనుకున్నాం. జట్టుగా ఆడాం. ఒకరికొకరం సహాయం చేసుకున్నాం. గోల్‌ మిస్‌ అవుతుంది అనుకున్నపుడు.. డిఫెన్స్‌పై దృష్టి సారించాం. మా వ్యూహం ఫలించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. క్వార్టర్‌ ఫైనల్స్‌లో విజయం ఎంతో ఉత్సాహాన్నిచ్చింది’’ అని భారత మహిళా హాకీ జట్టు గోల్‌ కీపర్‌ సవితా పునియా హర్షం వ్యక్తం చేసింది.

అదే విధంగా... ‘‘ఈ మ్యాచ్‌ ‘‘డూ ఆర్‌ డై’’ సిట్యుయేషన్‌ అని కోచ్‌ చెప్పారు. ఈ 60 నిమిషాలే కీలకం అని కోచ్‌ చెప్పారు’’ అని హాకీ కోచ్‌ జోర్డ్‌ మారిజ్నే చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. కాగా సోమవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌లో వరల్డ్‌ నెంబర్‌ 2 ఆస్ట్రేలియాపై ఆది నుంచి ఆధిపత్యం కొనసాగించిన భారత్‌ 1-0తో గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 

ఇక ఈ మ్యాచ్‌ మొత్తంలో ఏకైక గోల్‌ చేసిన భారత హాకీ క్రీడాకారిణి గుర్జీత్‌ కౌర్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ విజయంతో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. ఈ గెలుపునకై జట్టంతా ఎంతో కఠిన శ్రమ చేసింది. కోచింగ్‌ స్టాఫ్‌ సహా మిగతా సభ్యులమంతా ఒక కుటుంబంలాగా కలిసే ఉంటాం. సమిష్టిగా పోరాడి సెమీస్‌కు చేరుకున్నాం. భారత మహిళా హాకీ జట్టుకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా విజయం కోసం ప్రార్థించినందుకు కృతజ్ఞతలు’’ అని హర్షం వ్యక్తం చేసింది.

నమ్మకమే గెలిపించింది
‘‘మనం ఏది నమ్ముతామో అది నిజం అవుతుంది అంటారు కదా. మా విషయంలో కూడా అదే జరిగింది అనుకుంటున్నాం. గతం గురించి ఆలోచించాల్సిన పనిలేదు. ఓటమి చెందినంత మాత్రాన విశ్వాసం కోల్పోకూడదని అమ్మాయిలకు చెప్పాను. అవసరమైన సమయంలో ఎలా స్పందించామనేదే ముఖ్యం. ఐర్లాండ్‌ చేతిలో ఇలాంటి విషయాలను ప్రతిబింబించే సినిమాను వాళ్లకు చూపించాను. నిజంగా అది మాకు హెల్‌‍్ప అయిందనే అనుకుంటున్నాను. ఈ రోజు మేం గెలిచాం’’ అని భారత మహిళా హాకీ జట్టు కోచ్‌ జోర్డ్‌ మారిజ్నే చెప్పుకొచ్చాడు. కాగా భారత మహిళా జట్టు అర్జెంటీనాతో సెమీస్‌లో తలపడనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top