Tokyo Olympics: రగ్భీలో దుమ్మురేపిన ఫిజీ.. వరుసగా రెండోసారి స్వర్ణం

Tokyo Olympics: Fiji Won Consecutive 2nd Gold Medal In Rugby Game - Sakshi

టోక్యో: పసిఫిక్‌ మహా సముద్రంలోని ఓ చిరు దీవి ఫిజీ దేశం తన రగ్బీ టైటిల్‌ నిలబెట్టుకుంది. తద్వారా వరుస ఒలింపిక్స్‌ క్రీడల్లో బంగారు పతకాలు సాధించింది. బుధవారం జరిగిన ఫైనల్లో ఫిజీ జట్టు 27–12 స్కోరు తేడాతో ప్రపంచకప్‌ చాంపియన్‌ న్యూజిలాండ్‌పై నెగ్గింది. ఇటు ఫిజీ, అటు కివీస్‌... ఇరు దేశాల జాతీయ క్రీడ రగ్బీనే! పైగా ఫైనల్‌ కూడా ఈ రెండు పసిఫిక్‌ జట్ల మధ్యే జరగడం మరో విశేషం. ఈ మ్యాచ్‌లో ఫిజీ ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. తొలి అర్ధభాగంలోనే ప్రత్యర్థిపై పైచేయి సాధించారు. 19–12తో ముగించారు. ఇక ద్వితీయార్ధంలో అయితే న్యూజిలాండ్‌ను ఒక్క పాయింట్‌ కూడా చేయనీకుండా పరిపూర్ణ ఆధిపత్యాన్ని చాటారు. రెండో అర్ధ భాగంలో ఫిజీ మరో 8 పాయింట్లు చేస్తే కివీస్‌ స్కోరే చేయలేదు. 

ఈ విజయం కోసం, ఒలింపిక్స్‌ స్వర్ణం కోసం రగ్బీ జట్టు ఓ రకంగా యజ్ఞమే చేసింది. కోవిడ్‌ కోరలకు చిక్కకుండా ఒకట్రెండు కాదు నెలల తరబడి బయో బబుల్‌లో గడిపింది. కఠోర సాధన చేసింది. ఇప్పుడు అనుకున్నది సాధించినా... వెంటనే కుటుంబాలను కలిసే వీల్లేదు. కఠినమైన క్వారంటైన్‌ పూర్తయ్యాకే టైటిల్‌ సంతోషాన్ని ఫిజీ వాసులతో, కుటుంబసభ్యులతో పంచుకోవాల్సి ఉంటుంది. కివీస్‌ రజతంతో సరిపెట్టుకోగా... కాంస్య పతక పోరులో అర్జెంటీనా 17–12తో గత రన్నరప్‌ బ్రిటన్‌ను ఓడించింది. రగ్బీ క్రీడాంశాన్ని 2016 రియో ఒలింపిక్స్‌లోనే ప్రవేశపెట్టారు.  

నాడు హంగామా...  
‘రియో’లోనే ఈ ఆట రగ్బీ సెవెన్‌ పేరుతో విశ్వక్రీడల్లో భాగమైంది. తమకు ఇష్టమైన క్రీడలో ఫిజీ ఆటగాళ్లు ఆరంభం నుంచే అద్భుత ప్రదర్శన కనబరిచారు. చివరకు ఒలింపిక్స్‌ రగ్బీ సెవెన్‌లో బంగారు బోణీ కొట్టారు. ఈ ఘనతను, ఘనవిజయాన్ని ఆటగాళ్లకు ప్రోత్సాహంతో, భారీ ప్రైజ్‌మనీతో సరిపెట్టకుండా ఫిజీ ప్రభుత్వం చిరస్మరణీయం చేసుకోవాలని నిర్ణయించింది. సెంట్రల్‌ బ్యాంక్‌తో 7 ఫిజీ డాలర్‌ నోటును ముద్రించింది. నిజానికి ఏ దేశంలోనూ 7 విలువైన నోటు, నాణెం లేనేలేదు. అంతా 5, 10, 20, 50, 100 విలువల్లోనే ఉంటాయి. కానీ ఫిజీ తమ జట్టు సాధించిన రగ్బీ సెవెన్‌ ‘గోల్డ్‌’కు గుర్తుగా ఈ నోట్లను ముద్రించింది. అన్నట్లు కేవలం 9 లక్షల జనాభా కలిగిన ఫిజీ దేశానికి ఒలింపిక్స్‌ చరిత్రలో అదే తొలి స్వర్ణం!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top