కమ్‌బ్యాక్ కోసం కసరత్తు.. గంభీర్ ముందున్న కీలక సవాళ్లు ఇవే | Test of Indias leadership: Gautam Gambhir And Shreyas Iyer ponder over selection for IND vs ENG T20I series | Sakshi
Sakshi News home page

IND vs ENG: కమ్‌బ్యాక్ కోసం కసరత్తు.. గంభీర్ ముందున్న కీలక సవాళ్లు ఇవే

Jun 30 2026 5:31 PM | Updated on Jun 30 2026 6:30 PM

Test of Indias leadership: Gautam Gambhir And Shreyas Iyer ponder over selection for IND vs ENG T20I series

ఐర్లాండ్ గడ్డపై ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న టీమిండియా.. మూడు రోజులు తిరగకముందే మ‌రో కీల‌క పోరుకు సిద్ద‌మైంది. జూలై 1 (బుధ‌వారం) భార‌త్-ఇంగ్లండ్ మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో ఐర్లాండ్ సిరీస్‌లో చేసిన త‌ప్పుల‌ను ఇంగ్లండ్‌లో పున‌రావృతం చేయకూడదని భారత్ భావిస్తోంది. 

బెల్ఫాస్ట్‌లోని బౌన్సీ పిచ్‌లపై పూర్తిగా విఫలమైన భారత బ్యాటర్లు.. ఇప్పుడు ఇంగ్లీష్ కండీషన్స్ తగట్టు రాణించేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ కీలక సిరీస్‌కు ముందు భారత్ ముందున్న ప్రధాన సమస్యలపై ఓ లుక్కేద్దాం.

ఐర్లాండ్ చేతిలో ఘోర పరాయం తర్వాత భారత జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొందరు ఆటగాళ్లను మార్చాలని, కోచ్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తుంటే.. మరికొందరు టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి లేకపోవడం వల్లే ఇలా జరిగిందని అభిప్రాయపడుతున్నారు. 

అయితే  ఈ రెండు వాదనలూ పూర్తిగా కరెక్ట్ కావు. ఆగస్టు 2023 తర్వాత భారత్ ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. టీ20 ప్రపంచకప్‌-2028 సైకిల్‌లో భారత్‌కు ఇదే తొలి టీ20 సిరీస్‌. మొదటి సిరీస్‌లోనే భారత్ ఓటమి చవిచూసింది. అయితే ఈ ఒక్క ఓటమికే  పూర్తిగా మార్చేయాల్సిన అవసరం లేదు, అలాగని ఆటగాళ్ల నిర్లక్ష్య ధోరణిని కూడా స‌మ‌ర్ధించకూడ‌దు. ఇంగ్లండ్ టూర్‌లో విజ‌య‌వంతం కావాలంటే జ‌ట్టు మొత్తం స‌మిష్టింగా రాణించాలి.

సంజూకు మ‌ద్ద‌తిస్తారా?  వైభ‌వ్‌ను ఆడిస్తారా?
ఐర్లాండ్ సిరీస్‌కు ముందు స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ అద్భుత‌మైన ఫామ్‌ను క‌న‌బ‌రిచాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026తో పాటు ఐపీఎల్‌లోనూ దుమ్ములేపాడు. కానీ ఐర్లాండ్‌కు వ‌చ్చేట‌ప్ప‌టికి మాత్రం ప‌రిస్థితి తారుమారు అయిపోయింది. 

రెండు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 5 బంతులు మాత్రమే క్రీజులో నిలబడగలిగాడు. మ‌రోవైపు సంచ‌ల‌న బ్యాటింగ్‌తో క్రికెట్ ప్ర‌పంచాన్ని తన‌వైపు తిప్పుకొన్న వైభ‌వ్ సూర్య‌వంశీ మాత్రం ఈ సిరీస్‌లో బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. ఈ సిరీస్‌లో వైభ‌వ్ అరంగేట్రం చేస్తాడ‌ని అంతా భావించారు.

కానీ రెండు మ్యాచ్‌ల‌లోనూ వైభ‌వ్‌కు తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. మొద‌టి టీ20లో సంజూ విఫ‌ల‌మైన‌ప్ప‌టికి, రెండో మ్యాచ్‌కు కూడా అత‌డిని కొన‌సాగించారు. మ‌రోఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ రెండో మ్యాచ్‌లో విఫ‌ల‌మైన మొద‌టి టీ20లో విఫ‌ల‌మయ్యాడు. ప్ర‌స్తుతానికి టీమ్ మెనెజ్‌మెంట్ వైభ‌వ్ కంటే సంజూకే ఎక్కువ‌గా మ‌ద్ద‌తు ఇస్తోంది. 

కానీ ఇషాన్ కిషన్ లాంటి మరో వికెట్ కీపర్ కూడా అందుబాటులో ఉండ‌డంతో సంజూ ప్లేస్ డెంజ‌ర్‌లో ప‌డిన‌ట్లే. సంజూ ఇంగ్లండ్ సిరీస్‌లో రాణించ‌క‌పోతే జట్టు నుంచి పక్కన పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అతడి స్ధానంలో వైభవ్‌ను ఓపెనర్‌గా పంపే అవకాశముంది.

కలవరపెడుతున్న తిలక్‌ ఫామ్‌
ఇక హైదరాబాదీ తిలక్‌ వర్మ భారత టీ20 జట్టులో గత కొంతకాలంగా కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. అయితే అతడి 
ప్రస్తుత ఫామ్ టీమ్‌ మేనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. ముఖ్యంగా స్ట్రైక్‌ రేట్‌ పరంగా తిలక్‌ తీవ్ర నిరాశపరుస్తున్నాడు. ఐర్లాండ్‌ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 21 బంతుల్లో 19 పరుగులు చేసిన తిలక్‌.. రెండో టీ20లో 46 బంతుల్లో 55 రన్స్‌ చేశాడు. 

స్పిన్నర్లను ఎదుర్కోవడంలో కూడా  తిలక్ ఘోరంగా విఫలమవుతున్నాడు. ఐపీఎల్‌-2025 నుంచి స్పిన్నర్లపై అతడి స్ట్రైక్‌ రేట్‌ కేవలం 115.50 మాత్రమే. మిడిలార్డర్‌లో స్పిన్‌ బాగా ఆడే బ్యాటర్లు అవసరం. కానీ తిలక్‌ మాత్రం తన లోపాన్ని  సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదు.

వాషింగ్టన్ సుందర్‌ రోల్‌ ఏంటి?
ఇక ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ జట్టులో ఎందుకు ఉన్నాడో తెలియడం లేదు. పేరుకే ఆల్‌రౌండర్‌ కానీ, అతడి సేవలను మేనెజ్‌మెంట్‌ ఉపయోగించుకోవడం లేదు. ఐర్లాండ్‌ సిరీస్‌లో అతడు కేవలం ఒకే ఒక మ్యాచ్‌ ఆడాడు. అయితే ఆ మ్యాచ్‌లో అతడు కేవలం ఒకే ఓవర్‌ వేశాడు. అది కూడా 16 ఓవర్‌లో బౌలింగ్‌ ఇవ్వడం అందరిని షాక్‌కు గురిచేసింది.  డెత్ ఓవర్ల బౌలర్ కాని సుందర్‌కు అంత ఆలస్యంగా బంతిని ఎందుకు ఇచ్చారో ఎవరికి ఆర్దం కాలేదు. ఆ ఓవర్‌లో అతడు ఏకంగా 19 పరుగులు సమర్పించుకున్నాడు. 

గౌతమ్‌ గంభీర్‌ హయంలో సుందర్ సగటున మ్యాచ్‌కు 2 ఓవర్లు కూడా వేయడం లేదు.  16 మ్యాచ్‌ల్లో కేవలం 30.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ చేశాడు. ఇక బ్యాటింగ్‌లోనూ అతని స్థానంపై స్పష్టత లేదు. 18 మ్యాచ్‌ల్లో అతను బ్యాటింగ్ చేసింది కేవలం 11 సార్లు మాత్రమే.

 పైగా ప్రస్తుతం అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఇద్దరూ ఒకే మిడిల్ ఆర్డర్ స్థానం కోసం పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో ఒకరికే చోటు దక్కుతుంది. అలాంటిప్పుడు సుందర్‌ను ఎందుకు టీ20లకు ఎంపిక చేస్తున్నార్నని మాజీలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement