
బాక్సింగ్ రింగ్ బరిలో తైక్వాండో దిగ్గజ క్రీడాకారిణి జేడ్ జోన్స్
లండన్, రియో ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాలు నెగ్గిన బ్రిటన్ స్టార్
లండన్: జేడ్ జోన్స్... బ్రిటన్ ప్రొఫెషనల్ తైక్వాండో ప్లేయర్. అంతేకాదు! స్వదేశంలో జరిగిన 2012 లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో... 2016 రియో ఒలింపిక్స్ క్రీడల్లో... మహిళల తైక్వాండో ఈవెంట్‌లో స్వర్ణ పతకాలు గెలుచుకుంది. తదనంతరం 2020 టోక్యో, 2024 పారిస్ విశ్వక్రీడల్లోనూ జేడ్ పాల్గొంది. 2010లో యూత్ ఒలింపిక్స్ స్వర్ణం మొదలు, ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్, ప్రపంచ చాంపియన్‌షిప్, యూరోపియన్ గేమ్స్, యూరోపియన్ చాంపియన్‌షిప్, గ్రాండ్‌ప్రి ఈవెంట్లలో 36 (19 స్వర్ణాలు, 11 రజతాలు, 6 కాంస్యాలు) పతకాలు గెలుచుకుంది.
జేడ్ జోన్స్ పతకాల సంఖ్య ఆమె వయసు (31 ఏళ్లు)ను ఎప్పుడో మించిపోయింది. బహుశా ‘కిక్’ కొడితే పతకాలు రాలుతున్న తైక్వాండో క్రీడాంశం బోర్ కొట్టించిదేమో తెలియదు కానీ ఈ బ్రిటన్ క్రీడాకారిణి ఇప్పుడు కొత్త ‘పంచ్’కు సిద్ధమైంది. బాక్సింగ్‌ను తెగ ఇష్టపడటం వల్లే 20 ఏళ్ల తర్వాత కొత్త కెరీర్‌లోకి అడుగుపెడుతున్నట్లు జోన్స్ చెప్పింది. రింగ్‌లో ఆమె అపుడే లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకుంది.
‘ఇప్పటికే తైక్వాండోలో ప్రపంచ చాంపియన్ అయ్యాను. త్వరలో బాక్సింగ్‌లోనూ ప్రపంచ చాంపియన్ కావాలని ఆశిస్తున్నాను. రెండు వేర్వేరు క్రీడల్లో ఈ ఘనత సాధిస్తే గొప్పగా ఉంటుంది కదూ’ అని చెప్పింది. బ్రిటిష్, కామన్వెల్త్ ఫెదర్‌వెయిట్ మాజీ చాంపియన్ స్టీఫెన్ స్మిత్ కోచింగ్‌లో తీవ్రస్థాయిలో కసరత్తులు కూడా చేస్తోంది.
అయితే మూడు పదుల వయసు దాటిన తర్వాత పూర్తిగా కొత్త క్రీడలో పతకాలు సాధించడం పెద్ద సవాల్ అని చెప్పొచ్చు. 19 ఏళ్ల టీనేజ్‌లోనే జోన్స్ లండన్ విశ్వక్రీడల్లో బంగారు పతకం గెలిచింది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత ‘రియో’లో నిలబెట్టుకుంది.