నేడు న్యూజిలాండ్‌తో భారత్‌ కీలక పోరు.... ఓడితే ఇక అంతే!

T20 World Cup 2021: Virat Kohli India takes on Kane Williamson New Zealand On OCt 31st - Sakshi

నేడు న్యూజిలాండ్‌తో భారత్‌ ‘ఢీ

ఓడితే సెమీస్‌ అవకాశాలు క్లిష్టం

టి20 ప్రపంచకప్‌లో కీలక మ్యాచ్‌

రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

టి20 ప్రపంచకప్‌లో క్వార్టర్‌ ఫైనల్‌లాంటి సమరం! గెలిచిన జట్టు సెమీఫైనల్‌ చేరేందుకు చేరువయ్యే అవకాశం ఉండగా... ఓడితే మాత్రం పరిస్థితి ఇబ్బందికరంగా మారిపోతుంది. తర్వాతి మ్యాచ్‌లలో ఫలితాలతో పాటు ఎన్నో సమీకరణాలు ముందుకు వస్తాయి. ఈ నేపథ్యంలో తమ రెండో లీగ్‌ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్‌ తలపడబోతున్నాయి. ఇరు జట్లు తర్వాతి మ్యాచ్‌లలో చిన్న జట్లతో ఆడనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఫలితం ఎంతో కీలకం కానుంది. ఇలాంటి స్థితిలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరం.

2019 వన్డే వరల్డ్‌కప్‌ సెమీస్‌... 2021 టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌... గత రెండు ఐసీసీ టోర్నీలలో న్యూజిలాండ్‌ జట్టు భారత్‌ను దెబ్బ కొట్టి అభిమానుల ఆశలు గల్లంతు చేసింది. మరింత వెనక్కి వెళితే గత టి20 ప్రపంచకప్‌లో కూడా భారత్‌ను సొంతగడ్డపైనే చిత్తు చేసింది. ఓవరాల్‌గా చూస్తే ప్రస్తుతం భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా... కివీస్‌ ఎంత ప్రమాదకర ప్రత్యర్థో కోహ్లి సేనకు బాగా తెలుసు. మొదటి మ్యాచ్‌ ఫలితాన్ని పక్కన పెట్టి తొలి విజయం కోసం రెండు టీమ్‌లు సన్నద్ధమైన తరుణంలో హోరాహోరీ పోరు ఖాయమనిపిస్తోంది. 

దుబాయ్‌: సరిగ్గా వారం రోజుల తర్వాత టి20 ప్రపంచకప్‌లో c తమ రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. గత ఆదివారం పాకిస్తాన్‌ చేతిలో ఓడిన కోహ్లి బృందం నేడు మరో కఠిన ప్రత్యర్థి న్యూజిలాండ్‌తో తలపడబోతోంది. గ్రూప్‌–2లో ఇప్పటికే పాక్‌ సెమీస్‌ చేరడం దాదాపుగా ఖాయం కాగా... రెండో స్థానం కోసం ఈ ఇరు జట్ల మధ్య పోటీ నెలకొనడంతో మ్యాచ్‌పై ఆసక్తి మరింత పెరిగింది. భారత అభిమానులకు ఈ ‘సూపర్‌ సండే’ ఎలాంటి ఆనందం పంచుతుందో చూడాలి.  

మార్పుల్లేకుండా... 
పాక్‌ చేతిలో 10 వికెట్ల పరాజయం తర్వాత భారత జట్టు కూర్పుపై తీవ్ర చర్చ జరిగింది. అయితే కోహ్లి మాటలను బట్టి చూస్తే అదే టీమ్‌ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. భువనేశ్వర్‌ గతంలోని లయను కోల్పోయి పెద్దగా ప్రభావం చూపలేకపోయినా... మరో మ్యాచ్‌లో అతనిపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నమ్మకం ఉంచనుంది. కేవలం బ్యాటింగ్‌కే పరిమితమవుతున్న హార్దిక్‌ పాండ్యా ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌ చేయాల్సిన ఒత్తిడిలో బరిలోకి దిగుతున్నాడు. ప్రాక్టీస్‌ సెషన్‌లో బౌలింగ్‌ చేసిన అతను కనీసం 1–2 ఓవర్లు వేయగలడని కెప్టెన్‌ చెప్పడంతో దీనిపై స్పష్టత వచ్చింది.

ఓపెనర్లు రోహిత్, రాహుల్‌ గత మ్యాచ్‌ వైఫల్యాన్ని పక్కన పెట్టి చెలరేగితే భారత్‌ భారీ స్కోరు చేయడం ఖాయం. షాహిన్‌ అఫ్రిది తరహాలోనే తాను కూడా రోహిత్‌ ఆట కట్టిస్తానని లెఫ్టార్మ్‌ పేసర్‌ బౌల్ట్‌ చెబుతుండగా, దీనిని అతను ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరం. కోహ్లి ఎప్పటిలాగే కీలక ఇన్నింగ్స్‌లో మ్యాచ్‌ను నడిపించలగలడు. నాలుగో స్థానంలో సూర్యకుమార్‌ తన సత్తాను ప్రదర్శించాల్సి ఉంది. పంత్, జడేజా కూడా దూకుడుగా ఆడితే భారత్‌కు తిరుగుండదు. షమీ, బుమ్రాలపై పేస్‌ భారం ఉండగా... వరుణ్‌ చక్రవర్తి మళ్లీ కీలకం కానున్నాడు. అశ్విన్‌ మరోసారి బెంచీకే పరిమితమయ్యే అవకాశం ఉంది.  

విలియమ్సన్‌ రాణించేనా... 
తమ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ కూడా తడబాటుకు గురైంది. షార్జాలాంటి అనుకూల పిచ్‌పై కూడా ఆ జట్టు 134 పరుగులకే పరిమితమైంది. ఇది ఆ టీమ్‌ బ్యాటింగ్‌ లోపాన్ని చూపిస్తోంది. విలియమ్సన్‌ చాలా కాలంగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడకపోగా, గప్టిల్‌లో గతంలోని మెరుపు లోపించింది. డరైల్‌ మిచెల్‌ ఓపెనింగ్‌ ప్రయోగాన్ని వదిలి కివీస్‌ ఫామ్‌లో ఉన్న కాన్వేతో ఓపెనింగ్‌ చేయించవచ్చు.

ఆల్‌రౌండర్‌గా నీషమ్‌ తన పాత్రను పోషిస్తే హిట్టర్‌గా పేరున్న ఫిలిప్స్‌ కూడా చివర్లో ధాటిగా ఆడగలడు. బౌల్ట్‌ అందించే ఆరంభ వికెట్లపైనే కివీస్‌ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. స్పిన్నర్లు సోధి, సాన్‌ట్నర్‌ భారత బ్యాట్స్‌మెన్‌పై ప్రభావం చూపించగలరు. గత మ్యాచ్‌లో విఫలమైన సౌతీ స్థానంలో మరో పేసర్‌ మిల్నేకు చాన్స్‌ దక్కవచ్చు.

పిచ్, వాతావరణం  
బ్యాటింగ్‌కు అనుకూలించే సాధారణ వికెట్‌. ఆరంభంలో బౌలర్లు ప్రభావం చూపగలరు. ఎప్పటిలాగే మంచును దృష్టిలో ఉంచుకొని టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌కే మొగ్గు చూపే అవకాశముంది. 

తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, రాహుల్, సూర్యకుమార్, పంత్, హార్దిక్, జడేజా, భువనేశ్వర్, షమీ, బుమ్రా, వరుణ్‌. 

న్యూజిలాండ్‌: విలియమ్సన్‌ (కెప్టెన్‌), గప్టిల్, కాన్వే, నీషమ్, ఫిలిప్స్, డరైల్, సీఫెర్ట్, సాన్‌ట్నర్, సోధి, బౌల్ట్, మిల్నే. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top