‘ఈ ఏడాదే టీమిండియాకు ఆడతాడు’

Suryakumar Will Be A Part Of Team India, Aakash Chopra - Sakshi

న్యూఢిల్లీ:  ముంబై ఇండియన్స్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న  యువ క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా ప్రశంసలు కురిపించాడు. అతనొక అసాధారణమైన క్రికెటర్‌ అంటూ చోప్రా కొనియాడాడు. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్‌ కీలక ఇన్నింగ్‌ ఆడిన తర్వాత చోప్రా తన యూట్యూబ్‌ చానెల్‌లో మాట్లాడుతూ.. ముంబై-ఢిల్లీ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ గేమ్‌ ఛేంజర్‌ పాత్ర పోషించాడన్నాడు.

‘అతని బ్యాటింగ్‌ చేసిన తీరు అమోఘం.  కవర్స్‌ పైనుంచి కొట్టిన షాట్లతో పాటు ఫ్లిక్‌ షాట్లు, కట్‌ షాట్లను అద్భుతంగా ఆడాడు. రబడా బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టేటప్పుడు ఫ్లిక్‌ చేసిన విధానం చాలా బాగుంది. ఆ సిక్స్‌ చూసిన తర్వాత నా మతి చెదిరిపోయింది. నేను ఇప్పుడు చెబుతున్నాను. సూర్యకుమార్‌ యాదవ్‌ టీమిండియాకు ఆడటం ఖాయం. ఈ ఏడాదే అతను టీమిండియా జట్టులో అరంగేట్రం చేస్తాడు. భారత్‌ తరఫున మ్యాచ్‌లు ఆడతాడు. ఈ నా మాట హృదయం నుంచి వచ్చింది. అది జరుగుతుందని అంతా ఆశిద్దాం’ అని ఆకాశ్‌ చోప్రా తెలిపాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 163 పరుగుల టార్గెట్‌ను ముంబై ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగా ఛేదించింది. రోహిత్‌ శర్మ(5) విఫలమైనా , క్వింటాన్‌ డీకాక్‌(53; 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్‌ యాదవ్‌(53; 32 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌)లు సమయోచితంగా ఆడి విజయానికి బాటలు వేయగా, చివర్లో ఇషాన్‌ కిషన్‌(24), పొలార్డ్‌(15)లు ఆకట్టుకున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top