
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి "భారతరత్న" అవార్డు ఇవ్వాలని భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా భారత ప్రభుత్వాన్ని కోరాడు. భారత క్రికెట్‌కు చేసిన ఎనలేని సేవలకు గుర్తుగా విరాట్‌ను దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించాలని విజ్ఞప్తి చేశాడు. విశ్వ వేదికపై విరాట్ ఎన్నో అసాధారణ ఘనతలు సాధించి, త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడేలా చేశాడని అన్నాడు. భారతరత్న అవార్డుకు విరాట్ అన్ని విధాల అర్హుడని అభిప్రాయపడ్డాడు.
ఫేర్‌వెల్ మ్యాచ్ కూడా ఏర్పాటు చేయండి..!
కొద్ది రోజుల కిందట టెస్ట్ క్రికెట్‌కు అనూహ్య రీతిలో వీడ్కోలు పలికిన విరాట్‌కు తన సొంత మైదానమైన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫేర్‌వెల్ మ్యాచ్ ఏర్పాటు చేయాలని రైనా డిమాండ్ చేశాడు. ఆ మ్యాచ్‌కు విరాట్ కుటుంబ సభ్యులు, అతని చిన్ననాటి కోచ్‌లను ఆహ్వానించాలని బీసీసీఐని కోరాడు. భారత క్రికెట్‌కు ఎంతో చేసిన విరాట్‌కు సకల మర్యాదలతో వీడ్కలు పలకాలని విజ్ఞప్తి చేశాడు.
కాగా, విరాట్ కోహ్లి ఈ నెల 12వ తేదీన ఎవరూ ఊహించని రీతిలో టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ పర్యటనకు తన పేరును పరిశీలిస్తున్న వేల విరాట్ రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. విరాట్ అప్పుడే రిటైరయ్యాడేంటని భారత క్రికెట్ అభిమానులు తెగ బాధపడ్డారు.
36 ఏళ్ల విరాట్ తన 14 ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో 123 మ్యాచ్‌లు ఆడి 46.9 సగటున 30సెంచరీలు, 31 హాఫ్ సెంచరీల సాయంతో 9230 పరుగులు చేశాడు. ఇందులో 7 డబుల్ సెంచరీలు ఉన్నాయి. విరాట్.. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్ తర్వాత భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు చరిత్రలో నిలిచిపోయాడు.
విరాట్.. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ కూడా. అతని సారథ్యంలో టీమిండియా 68 మ్యాచ్‌ల్లో ఏకంగా 40 విజయాలు సాధించింది. 2024 టీ20 వరల్డ్‌కప్ తర్వాత పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.
ప్రస్తుతానికి సచిన్ ఒక్కడికే..!
ప్రస్తుతానికి భారతరత్న అవార్డు అందుకున్న ఏకైక క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఒక్కడే. సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని నెలల తర్వాత భారత ప్రభుత్వం అతన్ని భారతరత్న అవార్డుతో సత్కరించింది. సచిన్ 664 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించి 34,357 పరుగులు చేశాడు. ఇందులో 100 సెంచరీలు ఉన్నాయి. సెంచరీల సెంచరీ ఘనత భూగ్రహం మీద మరే ఇతర క్రికెటర్ సాధించలేదు.
భారతరత్న ఎవరికి ఇస్తారు..?
భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు సాహిత్యం, విజ్ఞానం, కళలు, ప్రజా సేవ, క్రీడలు వంటి రంగాలలో విశేష సేవలు చేసిన వారికి అందించబడుతుంది. భారత రాష్ట్రపతి ఈ అవార్డును ప్రదానం చేస్తారు.