'కోహ్లికి ఇచ్చారు.. నటరాజన్‌కు ఎందుకివ్వరు'

Sunil Gavaskar Claims Ashwin And Natarajan Subject To Different Rules - Sakshi

ఢిల్లీ : టీమిండియా మేనేజ్‌మెంట్ ఆటగాళ్ల విషయంలో పక్షపాతంగా వ్యవహరిస్తోందని లిటిల్‌ మాస్టర్‌ సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. టీమిండియాలో ఉన్న ఆటగాళ్లందరికి ఒకేలా రూల్స్‌ ఎందుకుండవని ప్రశ్నించాడు. ఆసీస్‌తో జరిగిన మొదటి టెస్టు అనంతరం విరాట్‌ కోహ్లి పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై గవాస్కర్‌ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీకి మాత్రమే పితృత్వ సెలవులు తీసుకునే హక్కు ఉందా..? ఈ మధ్యనే టీమిండియాలో అడుగుపెట్టిన యార్కర్‌ స్పెషలిస్ట్‌ టి. నటరాజన్‌కు పితృత్వ సెలవులు ఎందుకివ్వరు.. కొత్తగా జట్టులోకి వచ్చినంత మాత్రానా ఇలా పక్షపాతం చూపించడం కరెక్ట్‌ కాదు అని గెస్ట్‌కాలమ్‌లో చెప్పుకొచ్చాడు. (చదవండి : చిరుత కంటే వేగం.. అంత తేలిగ్గా మరిచిపోలేం)

'కోహ్లి విషయంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌ వ్యవహరించిన తీరును గమనిస్తే మరోసారి ఆటగాళ్లకుండే రూల్స్‌ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ప్రస్తుతం ఆసీస్‌ టూర్‌ ఉన్న ఒక యువ ఆటగాడు రూల్స్ గురించి కచ్చితంగా ఆశ్చర్యం వ్యక్తం చేసి ఉంటాడు. అతను ఎవరో కాదు.. టి. నటరాజన్. యార్కర్ల స్పెషలిస్ట్‌గా జట్టులోకి వచ్చిన అతను ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆరు వికెట్లతో సత్తా చాటాడు. నటరాజన్‌ ప్రదర్శకు ముగ్దుడైన హార్దిక్ పాండ్యా తనకి లభించిన మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌ నిజానికి నటారాజన్‌కు దక్కాల్సిందని తెలిపాడు. 

ఆసీస్‌ టూర్‌లో ఉన్న నటరాజన్ కూడా‌ ఇటీవలే తండ్రయ్యాడు. ఐపీఎల్‌ 2020 సమయంలోనే అతని భార్య బిడ్డను ప్రసవించింది.. కానీ నటరాజన్‌ తన బిడ్డని ఇంకా చూడలేదు. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత నటరాజన్‌ యూఏఈ నుంచి నేరుగా  ఆస్ట్రేలియాకి వెళ్లాల్సి వచ్చింది. వన్డే, టెస్టు సిరీస్‌ తర్వాత టెస్టు జట్టులో లేకపోయినా.. నెట్ బౌలర్‌గా నటరాజన్‌ను అక్కడే ఉంచేశారు. కానీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం తనకి పుట్టబోయే బిడ్డని చూసేందుకు భారత్‌కి వస్తున్నాడు. కానీ.. పుట్టిన బిడ్డని మొదటి సారి చూసేందుకు నటరాజన్‌ జనవరి మూడో వారం వరకూ ఎదురుచూడాల్సిన పరిస్థితి. కోహ్లికి ఒక రూల్‌... మిగతా ఆటగాళ్లకు మరో రూల్‌ ఉంటుందా. టీమిండియాలో ఒక్కో ఆటగానికి ఒక్కో రూల్‌ ఉండాలనేది జట్టు మేనేజ్‌మెంట్‌కు మాత్రమే చెల్లుతుందని' గవాస్కర్ విమర్శించాడు. కాగా కోహ్లి భార్య అనుష్క శర్మ వచ్చే ఏడాది జనవరిలో బిడ్డకి జన్మనివ్వనుంది. (చదవండి : దీనిని 'క్యాచ్‌ ఆఫ్‌ ది సమ్మర్'‌ అనొచ్చా..)


భారత్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌పై కూడా గవాస్కర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'టీమిండియా మేనేజ్‌మెంట్‌  స్పిన్నర్‌ అశ్విన్‌పై పక్షపాత ధోరణి చూపిస్తుంది. అశ్విన్‌కున్న ముక్కుసూటితనంతో జట్టులో అతను ఎప్పుడు స్థానం గురించి పోరాడాల్సి వస్తూనే ఉంది. అశ్విన్‌ తుది జట్టులోకి ఎప్పుడు వస్తాడో.. ఎప్పుడు వెళ్తాడో ఎవరికి అంతుచిక్కదు. ఒక మ్యాచ్‌లో అతని బౌలింగ్‌ బాగాలేకపోతే మరుసటి మ్యాచ్‌లోనే పక్కన పెట్టేస్తారు. 350 వికెట్లు.. బ్యాటింగ్‌లో నాలుగు సెంచరీలు చేసిన ఒక ఆటగాడిని ఏ జట్టు వదులుకోవడానికి సిద్ధపడదు. ఫాంలో లేకపోతే పక్కడ పెట్టడం సరైనదే.. దానికి ఒప్పుకుంటా. కానీ ఒక ఆటగాడు మంచి ఫాంలో ఉన్నప్పుడు కూడా జట్టు నుంచి తీసేయడమనేది అతని మానసిక దైర్యాన్ని దెబ్బతీయడం అవుతుంది.  టీమిండియా మేనేజ్‌మెంట్‌కు మాత్రమే ఇలాంటి విషయాలు చెల్లుబాటు అవుతాయి. ఆసీస్‌ టూర్‌లో అశ్విన్‌ ప్రధానపాత్ర పోషించనున్నాడనేది సత్యం.. ఇప్పటికైనా టీమిండియా మేనేజ్‌మెంట్‌ తన ధోరణి మార్చుకోవాలి' అని తెలిపాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top