ICC Tweet About Incredible Run Out By Jonty Rhodes in 1992 World Cup Match - Sakshi
Sakshi News home page

చిరుత కంటే వేగం.. అంత తేలిగ్గా మరిచిపోలేం

Published Thu, Dec 24 2020 9:35 AM

ICC Remembers Incredible Runout By Jonty Rhodes In 1992 World Cup - Sakshi

బ్రిస్బేన్‌ : జాంటీ రోడ్స్‌..  క్రికెట్‌లో ఈ పేరు తెలియనివారు ఉండరు. అప్పటివరకు మూస ధోరణిలో ఉండే ఫీ​ల్డింగ్‌కు కొత్త పర్యాయం చెప్పిన వ్యక్తి రోడ్స్‌.. క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ ఫీల్డర్‌గా ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. ఫీల్డింగ్‌ విన్యాసాలు.. డైవ్‌ క్యాచ్‌లు.. మెరుపువేగంతో రనౌట్‌లు.. మైదానంలో పాదరసంలా కదలడం లాంటివన్నీ రోడ్స్‌ వచ్చిన తర్వాత వేగంగా మారిపోయాయి. తన 11 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు.. రనౌట్లు.. వెరసి కొన్నిసార్లు దక్షిణాఫ్రికా జట్టును కేవలం తన ఫీల్డింగ్‌ ప్రతిభతో మ్యాచ్‌లు గెలిపించాడు. (చదవండి : బాక్సింగ్‌ డే టెస్టుకు ఆ ఇద్దరు ఆటగాళ్లు‌ దూరం)

అందుకు చాలా ఉదాహరణలున్నాయి.. వాటి గురించి మాట్లాడుకుంటే మొదటగా గుర్తుకువచ్చేది 1992 ప్రపంచకప్‌.. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోడ్స్‌.. ఇంజమామ్‌ను రనౌట్‌ చేసిన తీరు క్రికెట్‌ చరిత్రలో నిలిచిపోయింది. రోడ్స్‌ చేసిన విన్యాసం జిమ్‌ ఫెన్‌విక్‌ అనే ఫోటోగ్రాఫర్‌ తన కెమెరాలో బంధించగా.. అది బెస్ట్‌ ఫోటోగ్రఫీగా నిలిచిపోయింది. ఆ మ్యాచ్‌లో మొదటగా బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 211 పరుగులు చేసింది. ఆ తర్వాత మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో 36 ఓవర్లకు కుదించి 194 పరుగులను రివైజ్డ్‌ టార్గెట్‌గా విధించారు. వర్షం తర్వాత మ్యాచ్‌ ప్రారంభమైంది. పాక్‌ జట్టు రెండు వికెట్ల నష్టానికి 135 పరుగులతో పటిష్టంగా నిలిచి విజయానికి చేరువలో ఉంది. క్రీజులో ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ 48 పరుగులతో మంచి టచ్‌లో ఉండగా.. కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ అతనికి అండగా ఉన్నాడు.


అలెన్‌ డొనాల్డ్‌ బౌలింగ్‌లో బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా ఇంజమామ్‌ షాట్‌ ఆడాడు.  ఇంజమాముల్‌ హక్‌ కొట్టిన బంతిని రోడ్స్‌ చురుగ్గా అందుకొని చిరుత కంటే వేగంగా పరిగెత్తి వికెట్లను గిరాటేసి ఔట్‌ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఇంజమామ్‌ షాక్‌కు గురికాగా.. సఫారీ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. మంచి ఫామ్‌లో ఉన్న ఇంజమామ్‌ను రోడ్స్‌ ఔట్‌ చేయడంతో ఆ ప్రభావం పాక్‌పై తీవ్రంగా పడి 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక ఈ రనౌట్‌తోనే జాంటీ రోడ్స్‌ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఒకే మ్యాచ్‌లో 5 క్యాచ్‌లు అందుకున్న ఘనత రోడ్స్‌ పేరిట ఇప్పటికి నిలిచిపోయింది.  తాజాగా ఐసీసీ క్రిస్టమస్‌ సందర్భంగా మరోసారి జాంటీ రోడ్స్‌ రనౌట్‌ ఫీట్‌ను స్నో స్టాపింగ్‌ మూమెంట్‌ పేరుతో ట్విటర్‌లో షేర్‌ చేసింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement