
షూటర్ సిఫ్ట్ కౌర్ ఆకాంక్ష
న్యూఢిల్లీ: దాదాపు ఏడాది క్రితం... పారిస్ ఒలింపిక్స్... 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్... భారత్‌కు చెందిన 23 ఏళ్ల సిఫ్ట్ కౌర్ సమ్రాపై భారీ అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా పతకం సాధించగల షూటర్ల జాబితాలో ఆమె కూడా ఉంది. సంవత్సరం ముందు ఇదే ఈవెంట్‌లో సిఫ్ట్ ప్రపంచ రికార్డును నమోదు చేయడం కూడా అందుకు ఒక కారణం. అయితే అసలు సమయంలో రైఫిల్ గురి చెదిరింది. సగటు భారత అభిమాని కూడా ఆశ్చర్యపోయే రీతిలో ఒక్కసారిగా పేలవ ప్రదర్శన నమోదైంది.
32 మంది పోటీ పడితే సిఫ్ట్ కౌర్ 31వ స్థానంతో ముగించింది! ఈ షాక్‌కు ఒక్కసారిగా సిఫ్ట్ ఆట నుంచి తప్పనిసరిగా విరామం తీసుకోవాల్సి వచ్చింది. ఇకపై భవిష్యత్తు గురించి సందేహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎట్టకేలకు నాటి పరాభవం నుంచి కోలుకున్న సిఫ్ట్ ఇప్పుడు మళ్లీ చిరునవ్వులు చిందించింది. ఇటీవల జరిగిన వరల్డ్ కప్‌లో ఆమె స్వర్ణంతో మెరిసి ఒలింపిక్ బాధను కాస్త మర్చిపోయేలా చేసుకుంది.
నిరాశ నుంచి కోలుకొని...
పారిస్‌లో ఘోర ప్రదర్శన తర్వాత సిఫ్ట్ కౌర్ మానసికంగా చాలా కుంగిపోయింది. ఆ ఈవెంట్ ముగిసిన సమయం నుంచి ఆమెను సాధారణ స్థితికి తెచ్చేందుకు తల్లిదండ్రులు, సోదరుడు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. పారిస్ ఒలింపిక్స్ వేదిక నుంచి ఆమెను విహారయాత్ర కోసం వారు మరో నగరానికి తీసుకెళ్లి సరదాగా గడిపి వచ్చారు. స్వదేశానికి తిరిగొచ్చాక తండ్రి మరో రూపంలో ఆమెను బిజీగా ఉంచే ప్రయత్నం చేశారు. మళ్లీ మళ్లీ వైఫల్యం గురించి, స్కోర్ల గురించి ఆలోచించకుండా సరదాగా గన్స్‌తో ఆడుతున్నట్లుగానే ఆడమంటూ రైఫిల్ రేంజ్‌కే తీసుకెళ్లే ఓదార్చే ప్రయత్నం చేశాడు.
మన దేశంలో అభిమానులు ఒలింపిక్స్ క్రీడలకు అన్నింటికంటే చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని... అందరి దృష్టీ వాటి ఫలితాలపైనే ఉండటం వల్ల అసలు సమయంలో తాను తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు సిఫ్ట్ చెప్పుకుంది. కోలుకునేందుకు కొంత సమయం పట్టినా... తాను వెనక్కి వెళ్లి ఫలితాన్ని మార్చలేను కాబట్టి ఇక ఆలోచించడం అనవసరం అని ఆమె భావించింది.
జాతీయ స్థాయి పోటీలతో...
దాదాపు ఆరు నెలల తర్వాత సిఫ్ట్ మళ్లీ షూటింగ్‌లో పోటీ పడేందుకు సిద్ధమైంది. అందుకు ముందుగా పెద్ద ఆలోచనలు పెట్టుకోకుండా జాతీయ క్రీడల్లో పాల్గొంది. ఆమె స్థాయికి ఈ క్రీడలు చిన్నవే అయినా... ఆరంభానికి ఇదే సరైందని సిఫ్ట్ భావించింది. సహజంగానే స్వర్ణం నెగ్గడంతో కాస్త ఆత్మవిశ్వాసం వచ్చింది.
ఆ తర్వాత వరుసగా రెండు సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొని అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ చేసిన 595 పాయింట్ల స్కోరు పారిస్‌లో సాధించి ఉంటే ఆమె ఫైనల్స్‌కు చేరేది! తాజా ప్రదర్శనతో అర్జెంటీనాలో జరిగే వరల్డ్ కప్ షూటింగ్‌కు సిఫ్ట్ ఎంపికైంది.
సవాల్‌ను అధిగమించి...
బ్యూనస్‌ఎయిర్స్‌లో కొత్తగా నిర్మించిన రేంజ్‌లో వరల్డ్ కప్ స్థాయి పోటీలు జరగడం ఇదే తొలిసారి. వాతావరణం, గాలి దిశ... ఇలా అన్నీ కొత్తగానే ఉండటంతో సిఫ్ట్ కాస్త ఆందోళన చెందింది. 16.1 డిగ్రీల ఉష్ణోగ్రతలో మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు పోటీలు మొదలైనా ఇంకా చలిగానే ఉంది. తమ సన్నాహాలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమైన పరిస్థితి. అయితే పట్టుదలగా ఆడి క్వాలిఫికేషన్‌ను ఆమె అధిగమించింది. ఆపై ఫైనల్ పోరులో మళ్లీ తడబాటు. ‘నీలింగ్’ పొజిషన్ ముగిసేసరికి ఆమె చివరి స్థానంలో ఉంది.
‘ప్రొన్’ పొజిషన్ కాస్త మెరుగ్గా ఆడినా ఆ తర్వాతా అదే ఆఖరి స్థానం! ఆ తర్వాత తనకిష్టమైన ‘స్టాండింగ్’ పొజిషన్‌కు ఆమె సిద్ధమైంది. అసాధారణ ప్రదర్శన కనబరిస్తే గానీ ముందుకెళ్లే అవకాశం లేదు. ఇలాంటి సమయంలో సిఫ్ట్ తన ఆటకు పదును పెట్టింది. అద్భుతంగా లక్ష్యంపైకి బుల్లెట్లు సంధిస్తూ దూసుకుపోయింది. తుది ఫలితం చూస్తే 458.6 పాయింట్ల స్కోరుతో సిఫ్ట్‌కు స్వర్ణ పతకం.
‘నీలింగ్’ ముగిసిన తర్వాత సిఫ్ట్‌కంటే ఏకంగా 7.2 పాయింట్లు ముందంజలో ఉన్న జర్మనీ షూటర్ అనితను వెనక్కి నెట్టిన సిఫ్ట్ అగ్రస్థానం సాధించడం విశేషం. ఇప్పుడు సిఫ్ట్ తర్వాతి లక్ష్యం వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్. నవంబర్‌లో జరిగే ఈ పోటీల్లో చెలరేగి భారత్ తరఫున తొలి స్వర్ణం సాధించిన మహిళగా నిలవాలని సిఫ్ట్ కౌర్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసమే ఇప్పుడు తీవ్ర సాధనను కొనసాగిస్తోంది.