వివాదాస్పద రనౌట్ దుమారం: ‘డీకాక్‌ తప్పేమీ లేదు’

Pakistan Batsman Fakhar Zaman Speaks Controversial Run Out - Sakshi

జొహన్నెస్‌బర్గ్‌: ఆటల్లో క్రీడాస్ఫూర్తి అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా క్రికెట్‌లో దీని పాలు ఎక్కువే! అందుకే దీనిని జెంటిల్‌మెన్‌ గేమ్ అంటారు. ఆటలో ఏ జట్టుకైనా గెలుపోటములు సహజం. కానీ మైదానంలో ఆటగాళ్లు ఎలా ప్రవర్తించారనేది చాలా ముఖ్యం. అందుకు సంబంధించి ‘ఫెయిర్‌ ప్లే’ నియమ నిబంధనలూ ఉన్నాయి. అయితే, తాజాగా పాకిస్థాన్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఓపెనర్‌ ఫకర్‌ జమాన్ ‌(193; 155 బంతుల్లో 18x4, 10x6) ను రనౌట్‌ చేసిన విధానం వివాదాస్పదంగా మారింది. ఈ రనౌట్‌ కు సంబంధించి డీకాక్‌ చేసింది గేమ్‌ స్పిరిట్‌కు విరుద్ధమని పాక్‌ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఇదే విషయంపై తాజాగా ఫకర్‌ జమాన్‌ స్పందించాడు.

నేనే మరింత చురుగ్గా వ్యవహరించుండాలి
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో తన రనౌట్ బాధ్యతను ఫఖర్ జమానే తీసుకున్నాడు. ‘ఆ సమయంలో తానే మరింత చురుగ్గా వ్యవహరించి ఉండాల్సింది. ఇందులో వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ తప్పు లేదు. హరిస్ రౌఫ్ క్రీజ్ నుంచి కొంచెం ఆలస్యంగా పరుగు ప్రారంభించాడు, అందువల్ల అతను ఇబ్బందుల్లో పడతాడని నేను భావించాను. ఈ క్రమంలో నా దృష్టి కొంచెం మళ్లింది. కాబట్టి ఇందులో డికాక్‌ తప్పుందని నేను అనుకోవడంలేదు’అని జమాన్‌ పేర్కొన్నాడు.

ఇక రనౌట్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌ చివరి ఓవర్‌లో మార్క్రమ్ త్రో చేస్తున్న సమయంలో డీకాక్‌ చేసిన సైగలతో బంతి తను పరుగెడుతున్న వైపు రావడం లేదని భావించిన జమాన్ వేగాన్ని తగ్గించాడు. కాని బంతి అనూహ్యంగా అతని ఎండ్‌ వికెట్లకే తగిలి ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా రెండో వన్డేలో 342 పరుగులు చేసిన పాకిస్థాన్‌కు చివరి ఓవర్‌లో 31 పరుగులు అవసరం. జమాన్ రనౌట్ అయిన తరువాత, పాక్‌ 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

అసలు చట్టం ఏం చెప్తోంది

రూల్‌ 41.5.1 ప్రకారం స్ట్రైకర్ బంతిని అందుకున్న తర్వాత బ్యాట్స్‌మెన్‌ను అడ్డుకోవడం, ఏ ఫీల్డర్‌ అయినా మాటలు లేదా తమ చర్యల ద్వారా ఉద్దేశపూర్వకంగా బ్యాట్స్‌మన్‌ను దృష్టి మరల్చకూడదని పేర్కొటోంది.

( చదవండి: పవర్‌ఫుల్‌ షాట్‌.. కెమెరానే పగిలిపోయింది! )

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top