
అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీఫైనల్ చేరిన శ్రీకాంత్
మలేసియా ఓపెన్‌లో కొనసాగుతున్న సంచలన ప్రదర్శన
కౌలాలంపూర్: ఎట్టకేలకు భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. మలేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో 32 ఏళ్ల శ్రీకాంత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 65వ ర్యాంకర్ శ్రీకాంత్ 24–22, 17–21, 22–20తో ప్రపంచ 18వ ర్యాంకర్ టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. 74 నిమిషాలపాటు హోరాహోరీగా జరిగిన పోరులో శ్రీకాంత్ కీలకదశలో చెలరేగి తుది ఫలితాన్ని శాసించాడు.
నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ ఒకదశలో 7–11తో వెనుకబడ్డాడు. కానీ సంయమనం కోల్పోకుండా తన అనుభవాన్నంతా రంగరించి పోరాడిన శ్రీకాంత్ 14–14తో స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత 16–14తో ఆధిక్యంలోకి వెళ్లిన శ్రీకాంత్ అదే జోరును కొనసాగించి 20–17తో విజయం అంచుల్లో నిలిచాడు. అయితే పొపోవ్ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి స్కోరును 20–20తో సమం చేశాడు. కానీ శ్రీకాంత్ మరో అవకాశం ఇవ్వకుండా వరుసగా రెండు పాయింట్లు నెగ్గి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.
2024 మార్చిలో స్విస్ ఓపెన్‌లో చివరిసారి శ్రీకాంత్ సెమీఫైనల్ చేరుకున్నాడు. ఆ తర్వాత శ్రీకాంత్ 14 అంతర్జాతీయ టోర్నీల్లో పోటీపడ్డా క్వార్టర్ ఫైనల్ దశను దాటి ముందుకెళ్లలేకపోయాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 23వ ర్యాంకర్ యుషి తనాకా (జపాన్)తో శ్రీకాంత్ తలపడతాడు. మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) జోడీ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో తనీషా–ధ్రువ్ ద్వయం 22–24, 13–21తో జియాంగ్ జెన్ బాంగ్–వె యా జిన్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది.