Sachin-Sreesanth: శ్రీశాంత్‌పై క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Sreesanth Was Always A Talented Bowler Says Sachin Tendulkar - Sakshi

Sachin Tendulkar: ఇటీవలే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా వివాదాస్పద పేసర్‌ శ్రీశాంత్‌పై క్రికెట్‌ గాడ్‌ స‌చిన్ టెండూల్క‌ర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శ్రీ‌శాంత్‌ను తానెప్పుడూ టాలెంట్ ఉన్న బౌల‌ర్‌గానే చూసాన‌ని ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా కేరళ స్పీడ్‌స్టర్‌పై ప్రశంసలు కురిపించాడు. ఆరేళ్లపాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించినందుకు గాను ధన్యవాదాలు తెలుపుతూ..  శ్రీశాంత్‌ సెకండ్ ఇన్నింగ్స్‌కు ఆల్‌ ది బెస్ట్ చెప్పాడు. స‌చిన్  చేసిన ఈ పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌లవుతోంది. 

కాగా, 39 ఏళ్ల శ్రీ‌శాంత్ మార్చి 9న తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ట్విటర్‌ వేదికగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్రకటన అనంతరం అతను తన సొంత దేశవాళీ జట్టుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. రిటైర్మెంట్‌ గురించి కేరళ జట్టుకు ముందే సమాచారమందించినా పట్టించుకోలేదని, ఆరేళ్లపాటు టీమిండియాకు ఆడిన ఆటగాడికి కనీస మర్యాదగా వీడ్కోలు ఉంటుందని ఆశించానని, అయితే కొన్ని శక్తుల వల్ల తాను అందుకు కూడా నోచుకోలేకపోయానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

ఇదిలా ఉంటే, తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఇటీవలే రంజీల్లోకి రీఎంట్రీ ఇచ్చిన శ్రీశాంత్‌.. ప్రస్తుత రంజీ సీజన్‌లో ఓ మ్యాచ్ ఆడాడు. మేఘాలయాతో జరిగిన ఆ మ్యాచ్‌లో అతను రెండు వికెట్లు పడగొట్టాడు. 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడైన శ్రీశాంత్.. భారత్ తరఫున 27 టెస్ట్‌ల్లో 87 వికెట్లు, 53 వన్డేల్లో 75 వికెట్లు, 10 టీ20ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. త‌క్కువ కాలంలోనే టీమిండియాలో కీల‌క బౌల‌ర్‌గా ఎదిగిన శ్రీ.. 2013 ఐపీఎల్ సీజన్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్ప‌డి క్రికెట్‌కు దూర‌మ‌య్యాడు. ఈ ఘటనతో అతనిపై జీవిత కాలం నిషేధం ప‌డింది.
చదవండి: రిటైర్మెంట్‌ అనంతరం శ్రీశాంత్‌ సంచలన వ్యాఖ్యలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top