జన్సెన్‌ ఆల్‌రౌండ్‌ షో.. ఆసీస్‌కు షాకిచ్చిన సౌతాఫ్రికా.. సిరీస్ కైవసం

South Africa Beat Australia By 122 Runs In 5th ODI And Wins The Series By 3 2 - Sakshi

స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికా 3-2 తేడాతో కైవసం చేసుకుంది. జొహన్నెస్‌బర్గ్‌ వేదికగా ఇవాళ (సెప్టెంబర్‌ 17) జరిగిన ఐదో వన్డేలో సౌతాఫ్రికా 122 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. మార్కో జన్సెన్‌ ఆల్‌రౌండ్‌ షోతో (23 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్సర్లు, 8-1-39-5) ఇరగదీసి తన జట్టును విజయపథాన నడిపించాడు. జన్సెన్‌కు కేశవ్‌ మహారాజ్‌ (9.1-2-33-4) సహకరించడంతో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. మార్క్రమ్‌ (87 బంతుల్లో 93; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్‌ మిల్లర్‌ (65 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ చివర్లో మార్కో జన్సెన్‌, ఫెలుక్వాయో (19 బంతుల్లో 39 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో సౌతాఫ్రికా 300 స్కోర్‌ను దాటింది. ఆసీస్‌ బౌలర్లలో ఆడమ్‌ జంపా (3/71), సీన్‌ అబాట్‌ (2/54), గ్రీన్‌ (1/59), నాథన్‌ ఇల్లిస్‌ (1/49), టిమ్‌ డేవిడ్‌ (1/20) వికెట్లు పడగొట్టారు. 

అనంతరం 316 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌.. జన్సెన్‌, కేశవ్‌ మహారాజ్‌, ఫెలుక్వాయో (1/44) ధాటికి 34.1 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ (71) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. లబూషేన్‌ (44) పర్వాలేదనిపించాడు. వీరు మినహాయించి అంతా విఫలమయ్యారు.

వార్నర్‌ 10, ఇంగ్లిస్‌ 0, అలెక్స్‌ క్యారీ 2, గ్రీన్‌ 18, టిమ్‌ డేవిడ్‌ 1, సీన్‌ అబాట్‌ 23, మైఖేల్‌ నెసర్‌ 0, జంపా 5 పరుగులు చేసి నిరాశపరిచారు. కాగా, ఈ సిరీస్‌లో ఆసీస్‌ తొలి రెండు వన్డేలు గెలువగా.. ఆతర్వాత సౌతాఫ్రికా వరుసగా మూడు విజయాలు సాధించి, సిరీస్‌ కైవసం చేసుకుంది. దీనికి ముందు జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top