సైనా, శ్రీకాంత్‌ ఒలింపిక్స్‌ ఆశలు ఆవిరి!

Singapore Open cancelled, Saina, Srikanth to miss Olympics - Sakshi

‘టోక్యో’ చివరి క్వాలిఫయింగ్‌ టోర్నీసింగపూర్‌ ఓపెన్‌ను రద్దు చేసిన బీడబ్ల్యూఎఫ్‌

న్యూఢిల్లీ: చివరి నిమిషంలో అర్హత నిబంధనలలో మార్పులు చేస్తే తప్ప... టోక్యో ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌ ఆటను చూసే భాగ్యం లేనట్టే. ఆసియాలో కరోనా వైరస్‌ ఉధృతి ఇంకా కొనసాగుతుండటంతో... క్రీడాకారులతోపాటు టోర్నీ సహాయక సిబ్బంది, ఇతర వర్గాల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జూన్‌ 1 నుంచి 6 వరకు జరగాల్సిన సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌–500 టోర్నీని రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) బుధవారం ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్‌ అర్హత టోర్నీలలో భాగమైన ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్‌ను కరోనా కారణంగానే వాయిదా వేయగా... సింగపూర్‌ ఓపెన్‌ను ఏకంగా రద్దు చేయడంతో చివరి అవకాశంగా టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకోవాలన్న భారత స్టార్స్‌ సైనా, శ్రీకాంత్‌లకు నిరాశ ఎదురైంది.

భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా భారత్‌ నుంచి వచ్చే అన్ని విమానాలపై సింగపూర్‌ నిషేధం విధించింది. మరోవైపు జూన్, జూలైలలో జరగాల్సిన ఇతర టోర్నీలు కొరియా మాస్టర్స్, ఇండోనేసియా మాస్టర్స్‌ వాయిదా పడగా... ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌–1000 టోర్నీ, థాయ్‌లాండ్‌ ఓపెన్, యూఎస్‌ ఓపెన్‌ టోర్నీలు రద్దయ్యాయి. దాంతో ఈ ఏడాది జూలై 23న టోక్యో ఒలింపిక్స్‌ మొదలయ్యే వరకు అంతర్జాతీయ ఎలాంటి బ్యాడ్మింటన్‌ టోర్నీలు లేకుండా పోయాయి. ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలు రద్దయిన నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌ అర్హత నిబంధనల వివరాలపై మరో ప్రకటన విడుదల చేస్తామని బీడబ్ల్యూఎఫ్‌ తెలిపింది.

టోక్యో ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ నిబంధనల ప్రకారం సింగిల్స్‌లో ఒకే దేశం నుంచి ఇద్దరు అర్హత పొందాలంటే టాప్‌–16లో కచ్చితంగా ఉండాలి. ప్రస్తుతం ‘టోక్యో’ క్వాలిఫయింగ్‌ ర్యాంకింగ్స్‌లో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఏడో ర్యాంక్‌లో... సైనా 22వ ర్యాంక్‌లో ఉంది. దాంతో సింధుకు ‘టోక్యో’ బెర్త్‌ ఖరారయింది. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్‌ 13వ ర్యాంక్‌లో ఉండగా... శ్రీకాంత్‌ 20వ స్థానంలో ఉన్నాడు. దాంతో సాయిప్రణీత్‌కు టోక్యో బెర్త్‌ ఖాయమైంది. పురుషుల డబుల్స్‌లో తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్న సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జంట కూడా ‘టోక్యో’ బెర్త్‌ దక్కించుకుంది. 31 ఏళ్ల సైనా నెహ్వాల్‌ 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరగా... 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టింది. ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ అయిన  శ్రీకాంత్‌ 2016 రియో ఒలింపిక్స్‌లో క్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top