
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జట్టును ప్రకటించిన నాటి నుంచి రెండు పేర్లు చర్చనీయాంశమయ్యాయి. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), యశస్వి జైస్వాల్. ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో జైసూ కేవలం స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికైతే.. శ్రేయస్ అందుకు కూడా నోచుకోలేదు.
సెమీ ఫైనల్‌లో ఇద్దరూ విఫలం
ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు ముంబైకర్లకు మాజీ క్రికెటర్లు మద్దతుగా నిలిచారు. శ్రేయస్, జైసూలకు ఆసియా కప్ జట్టులో చోటు ఇవ్వాల్సిందంటూ బీసీసీఐ తీరును విమర్శించారు. ఇలా చాన్నాళ్లుగా వార్తల్లో ఉన్న ఈ ఇద్దరు.. తాజాగా దులిప్ ట్రోఫీ-2025 సెమీ ఫైనల్ సందర్భంగా మైదానంలో తిరిగి అడుగుపెట్టారు.
వెస్ట్ జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్.. దులిప్ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో నిరాశపరిచారు. బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్‌తో గురువారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్ట్ జోన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో బౌల్డ్
ఈ క్రమంలో హర్విక్ దేశాయ్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చిన యశస్వి జైస్వాల్ దారుణంగా విఫలమయ్యాడు. మూడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ బాది.. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఇక హర్విక్ ఒక్క పరుగు చేసి దీపక్ చహర్‌కు వికెట్ సమర్పించుకున్నాడు.
25 పరుగులు చేసిన అయ్యర్
వన్‌డౌన్‌లో వచ్చిన ఆర్య దేశాయ్ 39 పరుగులతో రాణించగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్ మాత్రం నిరాశపరిచాడు. 28 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ నాలుగు ఫోర్ల సాయంతో 25 పరుగులు సాధించాడు. షమ్స్ ములానీ 18 పరుగులు చేసి నిష్క్రమించాడు.
రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ప్రదర్శన
అయితే, నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం అద్భుత అర్ధ శతకం (94 నాటౌట్)తో రాణించి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ నేపథ్యంలో 45 ఓవర్ల ముగిసే సరికి వెస్ట్ జోన్ ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఇక సెంట్రల్ జోన్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు, దీపక్ చహర్, సారాంశ్ జైన్, హర్ష్ దూబే ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
విండీస్‌తో ఆడే జట్టుకు ఎంపిక అవ్వాలంటే
కాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో దులిప్ ట్రోఫీ-2025లో సత్తా చాటాలని.. శ్రేయస్ అయ్యర్ పట్టుదలగా ఉన్నాడు. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో నిరాశజనక ప్రదర్శనతో అతడి అవకాశాలు సన్నగిల్లినట్లే. రెండో ఇన్నింగ్స్‌లోనైనా రాణిస్తే భారత టెస్టు జట్టులోకి పునరాగమనం గురించి అయ్యర్ ఆశలు పెట్టుకోవచ్చు. మరోవైపు.. యశస్వి జైస్వాల్ టీమిండియా టెస్టు ఓపెనర్‌గా జట్టులో పాతుకుపోయిన విషయం తెలిసిందే.