పాకిస్తాన్ పేస్ దళ నాయకుడిగా పేరొందిన షాహిన్ ఆఫ్రిదిపై విమర్శల వర్షం కురుస్తోంది. టీ20 ప్రపంచకప్-2026లో పేలవ ప్రదర్శన, వన్డే కెప్టెన్‌గా బంగ్లాదేశ్ చేతిలో ఘోర ఓటమి ఇందుకు తాజా కారణాలు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు 103 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టార్మ్ పేసర్ 136 వికెట్లు కూల్చాడు.
తద్వారా పాక్ తరఫున పొట్టి క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షాహిన్ ఆఫ్రిది కొనసాగుతున్నాడు. అయితే, గత కొంతకాలంగా అతడి ఆట మరీ దిగజారింది. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో మొత్తంగా ఎనిమిది వికెట్లు మాత్రమే తీయగలిగాడు.
పదకొండేళ్ల తర్వాత
ఇక ఆ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనలో పాక్ వన్డే జట్టుగా బాధ్యతలు నిర్వర్తించిన షాహిన్ ఆఫ్రిది.. 2-1 తేడాతో పాక్ సిరీస్ కోల్పోవడంతో విమర్శల పాలయ్యాడు. దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత పాక్ బంగ్లాకు వన్డే సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి కావడంతో విమర్శలు పదునెక్కాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ సైతం షాహిన్ ఆఫ్రిది ఆట తీరుపై మండిపడ్డాడు.
జట్టులో చోటుకే దిక్కులేదు
‘‘పాకిస్తాన్ టీ20, వన్డే జట్ల కెప్టెన్‌గా షాహిన్ ఆఫ్రిది ఉండాలని గతంలో క్యాంపెయిన్ నడిచింది. ఆ తర్వాత వన్డేలకు బదులు టీ20 జట్టుకు కెప్టెన్ అయితే చాలు అన్నారు. కానీ ఇప్పుడు వన్డే కెప్టెన్‌గా అతడు పూర్తిగా విఫలమయ్యాడు.
నిజానికి పాక్ టీ20 జట్టులో అతడికి చోటు కూడా ఇవ్వొద్దు. ముఖ్యంగా తుదిజట్టులో ఉండే అర్హత అతడు కోల్పోయాడు. అతడి ఖేల్ ఖతమైపోయింది’’ అని రషీద్ లతీఫ్ షాహిన్ ఆఫ్రిదిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు.
మామ అలా
మరోవైపు.. బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ ఓటమి తర్వాత షాహిన్ ఆఫ్రిది మామ, మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ.. సెలక్షన్ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్, బంగ్లా సిరీస్‌లో ఓటముల నేపథ్యంలో విమర్శలకు సెలక్టర్లు అర్హులేనని తాను భావిస్తున్నట్లు తెలిపాడు. ఏ ఫార్మాట్‌కు ఎవరిని కెప్టెన్ చేయాలో తెలియదంటూ మండిపడ్డాడు. ఈ నేపథ్యంలో రషీద్ లతీఫ్ పైవిధంగా స్పందించడం గమనార్హం.


