టీ20 ప్రపంచకప్-2026 సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కి మద్దతుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఐపీఎల్ నుంచి బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రహమాన్‌ను తొలగించడంతో.. భారత్‌లో జరిగే తమ ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడమని బీసీబీ మొండికేసింది.
భద్రతా కారణాలు సాకుగా..
ఇందుకు భద్రతా కారణాలు సాకుగా చూపుతూ వేదికను మార్చాల్సిందిగా విజ్ఞప్తి చేయగా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిరాకరించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం బంగ్లాదేశ్ టోర్నీ నుంచి వైదొలిగింది. అయితే, ఈ విషయంలో తాము బంగ్లాకు మద్దతుగా టోర్నీని బాయ్‌కాట్ చేస్తామని నాటకాలాడిన పాక్.. తర్వాత భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తామని బెదిరింపులకు దిగింది.
బంగ్లాదేశ్ సహా ఇతర బోర్డుల నుంచి ఒత్తిడి, ఐసీసీ హెచ్చరికలతో పాక్ యూటర్న్ తీసుకుంది. భారత్‌తో కూడా మ్యాచ్ ఆడి.. అందులో ఓడి సెమీస్ కూడా చేరుకుండానే నిష్క్రమించింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) షెడ్యూల్‌ను పాక్ బోర్డు ప్రకటించింది.
ఎన్‌ఓసీ ఇచ్చినా..
ఇక బంగ్లాదేశ్ నుంచి ముస్తాఫిజుర్ రహమాన్, పర్వేజ్ హొసేన్ ఇమాన్ (లాహోర్ ఖలందర్స్), షోరిఫుల్ ఇస్లాం, నహీద్ రాణా, తాంజిద్ హసన్ తమీమ్, రిషాద్ హొసేన్ (పెషావర్ జల్మీ) పీఎస్‌ఎల్ వేలంలో అమ్ముడుపోయారు. అయితే, వీరికి బంగ్లా బోర్డు పీఎస్‌ఎల్‌లో ఆడేందుకు నిరభ్యంతర పత్రం (NOC) ఇచ్చినప్పటికీ ఓ మెలిక పెట్టినట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్ ఇటీవల అఫ్గనిస్తాన్‌పై వైమానిక దాడులు చేయగా.. సుమారుగా 400 మంది దుర్మరణం పాలయ్యారు. దీంతో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బీసీబీ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే తమ ప్లేయర్లను పాకిస్తాన్‌కు పంపాలా లేదా అన్న అంశంపై నిర్ణయం తీసుకోనుంది.
ప్రభుత్వం చెప్పినట్లే వింటాము
ఈ విషయం గురించి బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ నజ్ముల్ అబెదిన్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్‌కు ఆటగాళ్లను పంపే విషయంలో మేము ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో మాకు పూర్తిగా తెలియదు. అందుకే ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకుంటాము’’ అని పేర్కొన్నాడు. తమ ఆటగాళ్ల భద్రతే అన్నిటికంటే ముఖ్యమని పేర్కొన్నాడు.
కాగా ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం పీఎస్‌ఎల్‌లో ఆడేందుకు వెళ్లే తమ ఆటగాళ్లను భద్రత విషయమై హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా బంగ్లాదేశ్ కూడా వెనక్కి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ విదేశీ ఆటగాళ్లు దూరమైతే పీఎస్‌ఎల్‌కు ఉన్న ఆ మాత్రం ఆదరణ కూడా కరువయ్యే అవకాశం ఉంది.
చదవండి: IPL 2026: 'గొప్ప క్రికెటరేమి కాదు.. అతడికెందుకు రూ.25 కోట్లు'


