IND Vs SA 2nd Test Day 2: దక్షిణాఫ్రికాతో జొహనెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ ఐదు వికెట్లతో చెలరేగాడు. రెండో రోజు లంచ్ విరామానికి ముందు స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు పడగొట్టిన అతను.. రెండో సెషన్‌లోనూ వరుస ఓవర్లలో రెండు వికెట్లు సాధించి తొలిసారి ఐదు వికెట్ల ఘనత సాధించాడు. దీంతో జొహనెస్‌బర్గ్ వేదికగా ఈ ఘనత సాధించిన ఆరో ఇండియన్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
ఈ వేదికపై భారత దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే (6/53) తొలుత ఈ ఫీట్‌ను నమోదు చేయగా, ఆతర్వాత జవగళ్ శ్రీనాథ్ (5/104), శ్రీశాంత్ (5/40), జస్ప్రీత్ బుమ్రా (5/54), మహ్మద్ షమీ (5/29)లు ఈ మార్క్‌ని అందుకున్నారు. తాజాగా శార్దూల్ (5/37) వీరి సరసన చేరాడు. కెరీర్‌లో ఆరో టెస్ట్ ఆడుతున్న శార్ధూల్‌కి ఇదే తొలి 5 వికెట్ల ఘనత కావడం విశేషం.
ఇదిలా ఉంటే, రెండో రోజు ఆటలో శార్ధూల్ చెలరేగడంతో టీమిండియా పట్టుబిగించింది. టీ విరామం సమయానికి 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. క్రీజ్‌లో జన్సెన్(2), కేశవ్ మహారాజ్(11) ఉన్నారు. శార్ధూల్‌తో పాటు షమీ(2/52) కూడా రాణించాడు. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. 
చదవండి: Ind Vs Sa: అనవసరంగా బలైపోయాం.. కెప్టెన్ రాహుల్ అతడిని వెనక్కి పిలవొచ్చు!

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
