షమీ విజృంభణ: ఢిల్లీ విలవిల

Shami Got Shaw And Hetmyer In Same Over - Sakshi

దుబాయ్‌: ఐపీఎల్‌-13వ సీజన్‌లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ విలవిల్లాడుతోంది. 13 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి వికెట్‌గా శిఖర్‌ ధావన్‌ పెవిలియన్‌ చేరగా, ఆపై మరో నాలుగు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లను ఢిల్లీ చేజార్చుకుంది. ధావన్‌ అనవసరపు రన్‌ కోసం యత్నించి రనౌట్‌ కాగా, పృథ్వీ షా(5), హెట్‌మెయిర్‌(7)లను మహ్మద్‌ షమీ పెవిలియన్‌కు పంపాడు. కాస్త బౌన్స్‌ను మిక్స్‌ చేసి షమీ వేసిన లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతులకు పృథ్వీ షా, హెట్‌మెయిర్‌లు ఔటయ్యారు.  (చదవండి:‘ప్లేఆఫ్స్‌కు చేరకపోతే నేను ఫెయిలైనట్లే’)

షమీ వేసిన నాల్గో ఓవర్‌ మూడో బంతికి పృథ్వీ షా రెండో వికెట్‌గా ఔట్‌ కాగా, ఆ ఓవర్‌ చివరి బంతికి హెట్‌మెయిర్‌ పెవిలియన్‌ చేరాడు. రెండో ఓవర్‌లో ధావన్‌ డకౌట్‌గా అయిన కాసేపటికి షమీ వేసిన ఒకే ఓవర్‌లో ఢిల్లీ రెండు వికెట్లు కోల్పోవడంతో క్రీజ్‌లో నిలబడటానికి యత్నిస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కింగ్స్‌ పంజాబ్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటింగ్‌కు దిగింది. ఆరంభం నుంచి తడబడుతూ బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో స్కోరు మందగించింది.  తాజా మ్యాచ్‌లో ఢిల్లీ ఫేవరెట్‌గా బరిలోకి దిగినప్పటికీ ఇలా ఒత్తిడిలో పడి వికెట్లు చేజార్చుకోవడంతో ఆ జట్టు వికెట్లను కాపాడుకోవడంపై దృష్టి పెట్టింది. ఇది ఈ సీజన్‌ రెండో మ్యాచ్‌. ఇరు జట్లు బలాబలాల పరంగా చూస్తే ఢిల్లీనే మెరుగ్గా ఉంది. 

 ప్రస్తుతం ఢిల్లీ జట్టులో ఫినిషర్స్ కు కొదవ లేదు. ఒంటి చేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పే ప్లేయర్స్ ఈ జట్టులో ఉన్నారు. ఇక ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ అనుభవం యువ బౌలర్లకు చాలా ఉపయోగపడుతుంది. పేస్‌ బౌలింగ్‌ విభాగంలో ఇషాంత్‌ శర్మ, కగిసో రబడా, కీమో పాల్‌, మోహిత్‌ శర్మ, క్రిస్‌ వోక్స్‌లు ఉన్నారు. ఇక పంజాబ్‌ జట్టుకు కేఎల్‌ రాహుల్‌ సారథ్యం వహిస్తున్నాడు. షమీ కూడా కింగ్స్‌ పంజాబ్‌కు కీలక ఆటగాడే.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top