ఆసక్తికరం సాకిబ్ హుస్సేన్ ప్రస్థానం
సాక్షి క్రీడా విభాగం: రెండేళ్ల క్రితం కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. అయితే ఆ సీజన్‌లో జట్టులో భాగంగా ఉన్న పేసర్ సాకిబ్ హుస్సేన్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఫైనల్ మ్యాచ్ తర్వాత సాకిబ్ తల్లిదండ్రులు జట్టు కోచ్ గౌతమ్ గంభీర్‌ను కలిశారు. వారితో ఆప్యాయంగా మాట్లాడిన గంభీర్ ‘మీ వాడిలో చాలా ప్రతిభ ఉంది. జట్టు కూర్పులో భాగంగా అవకాశం ఇవ్వలేకపోయాం కానీ మున్ముందు అతను ఐపీఎల్‌లో తప్పక రాణిస్తాడు’ అని భరోసానిచ్చాడు. తర్వాతి సీజన్‌లో కేకేఆర్ అతడిని కొనసాగించకపోగా, ఈ ఏడాది సన్‌రైజర్స్ అతడిని ఎంచుకుంది. అతి సాధారణ నేపథ్యం ఉన్నా... కేవలం శ్రమ, పట్టుదలతో దూసుకొచ్చిన సాకిబ్ గాథ స్ఫూర్తిదాయకం.
పేదరికం నుంచి వచ్చి...
బిహార్‌లో బాగా వెనుకబడిన జిల్లాల్లో గోపాల్‌గంజ్ కూడా ఒకటి. అలాంటి ప్రాంతం నుంచి వచ్చిన సాకిబ్‌కు ఎప్పటికైనా ఆర్మీలో చేరాలనేది కోరిక. అందుకే 15 ఏళ్ల వయసులో స్థానిక ఆర్మీ గ్రౌండ్‌లో రన్నింగ్, ఎక్సర్‌సైజ్‌లు అలవాటుగా మార్చుకున్నాడు. అయితే తన స్నేహితుల ద్వారా క్రికెట్‌పై కొంత ఆసక్తి పెంచుకొని టెన్నిస్ బంతితో బౌలింగ్ ప్రారంభించిన అతను అదే బంతిపై పట్టు పెంచుకొని రాటుదేలాడు. స్థానికంగా జరిగే లేదా దాదాపు 185 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్నాకు వెళ్లి టోర్నీలు ఆడి వచ్చేవాడు. మ్యాచ్ ఆడిన రోజు రూ.500–1000 వరకు లభించేవి.
తమ టీమ్‌కు వరుస విజయాలు అందిస్తున్న సాకిబ్‌ను అంతా ‘గోపాల్‌గంజ్ కా రబాడ’ అని పిలిచేవాళ్లు. మరోవైపు వ్యవసాయదారుడు అయిన తండ్రి ఆదాయం చాలా స్వల్పం. క్రికెటర్‌గా శిక్షణ అందించే స్థాయి లేదు. ఇదే సమయంలో అతనికి మోకాలికి దెబ్బ తగలడంతో వ్యవసాయం కూడా కష్టంగా మారిపోయింది. ఇలాంటి స్థితిలో సాకిబ్ తెచ్చే చిన్న మొత్తం కూడా కుటుంబానికి ఉపయోగపడ్డాయి. క్రికెట్‌లో ఎదగాలని ప్రయతి్నస్తున్న సమయంలో రూ. 10 వేల విలువైన బౌలింగ్ స్పైక్స్ కొనే స్థోమత లేకపోగా...ఏదైతే అది అవుతుందని తల్లి తన వద్ద ఉన్న కాస్త నగలు అమ్మి స్పైక్స్ కొనిచ్చింది.
లోపాలు సరిదిద్దుకొని...
సాకిబ్ గురించి బాగా విన్న పట్నాలోని జెన్ నెక్ట్స్ అకాడమీ కోచ్ రాబిన్ సింగ్ ఈ కుర్ర పేసర్‌కు శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దేందుకు సిద్ధమయ్యాడు. కోచ్ మార్గనిర్దేశనంలో అతని బౌలింగ్ ఎంతో మెరుగైంది. ఈ క్రమంలో వరుసగా వేర్వేరు వయో విభాగాల్లో అవకాశాలు వచ్చాయి. అండర్–19 స్థాయిలో ఆకట్టుకున్న తర్వాతి 18 ఏళ్ల వయసులో ముస్తాక్ అలీ ట్రోఫీలో బిహార్ తరఫున టి20ల్లో అరంగేట్రం జరిగింది. అయితే నిలకడ లేక జట్టులో స్థానం కోల్పోయాడు. కానీ ఎరుపు బంతితో మరింత కష్టపడిన సాకిబ్ 2024లో తొలి రంజీ మ్యాచ్ ఆడాడు.
ఇక్కడా కర్ణాటకపై ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 13 నోబాల్స్ వేయడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. కానీ తన లోపాల నుంచి పాఠాలు నేర్చుకొని అతను ఎంతో మెరుగయ్యాడు. టి20ల్లో బౌలింగ్‌పై మరింత దృష్టి పెట్టిన అతనికి చెన్నై నెట్ బౌలర్‌గా అవకాశం లభించింది. ఆ తర్వాత కోల్‌కతా టీమ్‌లోకి తీసుకుంది. మ్యాచ్ ఆడలేకపోయినా... ఈ అనుభవాలు అతనికి తన ఆటను తీర్చిదిద్దుకునేందుకు పనికొచ్చాయి. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సాకిబ్ బౌలింగ్‌లో వైవిధ్యం కనిపించింది. ఆరంభంలో, డెత్‌లో కూడా పదునైన బంతులు వేయగల నైపుణ్యాన్ని అతను ప్రదర్శించాడు. ఇదే ఆటను కొనసాగిస్తే మున్ముందు సాకిబ్‌కు మంచి భవిష్యత్తు ఉండవచ్చు.


