రోహిత్, ఇషాంత్‌ అవుట్‌ 

Rohith Sharma And Ishanth Sharma Ruled Out Of First Two Tests - Sakshi

తొలి రెండు టెస్టులకు ఇద్దరు సీనియర్లు దూరం

శ్రేయస్‌ అయ్యర్‌కు చాన్స్‌!

న్యూఢిల్లీ : భారత క్రికెట్‌ జట్టుకే కాదు... అభిమానులనూ ఇది కచ్చితంగా నిరాశపరిచే వార్త!  బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ లకు అనుభవజ్ఞులైన స్టార్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, ఇషాంత్‌ శర్మ దూరమయ్యారు. అటు ప్రధాన బ్యాట్స్‌మన్‌ రోహిత్, ఇటు వెటరన్‌ పేసర్‌ ఇషాం త్‌ ఇద్దరూ దూరమవడం భారత్‌కు ఒక విధంగా ఆల్‌రౌండ్‌ దెబ్బలాంటిదే! జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లపై ఇది తప్పకుండా ప్రభావం చూపుతుందని భారత జట్టు మేనేజ్‌మెంట్‌ కలవరపడుతోంది.

అయితే చివరి రెండు టెస్టుల వరకల్లా అందుబాటులోకి రావాలని జట్టుతో పాటు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆశిస్తోంది. నిజానికి టెస్టు సిరీస్‌కు సమయమున్నప్పటికీ ఆస్ట్రేలియాలో అమలవుతున్న కఠిన కరోనా ఆంక్షల నేపథ్యంలో ఈ ఇద్దరు సీనియర్లు ఇప్పటికిప్పుడు  బయల్దేరితేనే తొలి టెస్టు ఆడగలరు. ఇదే విషయాన్ని ఆదివారం హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి కూడా చెప్పారు. అక్కడ 14 రోజుల ఐసోలేషన్‌ తర్వాతే వారు మైదానంలోకి అడుగు పెట్టి ప్రాక్టీస్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియాలో కోవిడ్‌ కేసులు అలజడి రేపుతున్న  దశలో అక్కడి  ప్రభుత్వం భారత క్రికెటర్లకు క్వారంటైన్‌ విషయంలో ఏమాత్రం మినహాయింపు ఇవ్వడం లేదు. అందుకే  సీనియర్‌ ఆటగాళ్లు తొలి రెండు టెస్టులకు దూరమని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. 

ఎన్‌సీఏలోనే ఆటగాళ్లు... 
సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన కోసం యూఏఈలో ఐపీఎల్‌ ముగిసిన వెంటనే భారత క్రికెట్‌ జట్టు సభ్యులు సిడ్నీ ఫ్లయిట్‌ ఎక్కారు. కానీ జట్టుకు ఎంపికైనప్పటికీ గాయాలతో రోహిత్, ఇషాంత్‌ వెళ్లలేకపోయారు. లీగ్‌ మధ్యలోనే పక్కటెముకల గాయంతో ఇషాంత్‌ స్వదేశానికి రాగా, తొడకండరాల గాయంతోనే ఫైనల్‌ మ్యాచ్‌ ఆడిన రోహిత్‌ భారత్‌కు వచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరు బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో పునరావాస శిబిరంలో ఉన్నారు. ఇషాంత్‌ గాయం నుంచి కోలుకోవడంతో ఫిజియో, ట్రెయి నర్‌ల పర్యవేక్షణలో ప్రాక్టీస్‌ పెంచాడు. అయితే మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ స్థాయికి ఇంకా రాలేదు. రోజుకు కనీసం 20 ఓవర్లయినా బౌలింగ్‌ చేస్తేనే టెస్టు బౌలర్‌ పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు. అందుకే పని ఒత్తిడిని ఉన్నపళంగా పెంచకుండా ఎన్‌సీఏ బృందం జాగ్రత్తలు తీసుకుంటోంది. వీళ్లిద్దరు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాలంటే మరో 3–4 వారాలు పడుతుందని ఎన్‌సీఏ ఫిజియో బోర్డుకు నివేదిక ఇచ్చాడు.  

అయ్యర్‌కు అవకాశం! 
పరిమిత ఓవర్ల జట్టు సభ్యుడైన శ్రేయస్‌ అయ్యర్‌కు టెస్టులాడే అవకాశం రావొచ్చు. రోహిత్‌ అం దుబాటులో లేకపోవడం, తొలి టెస్టు తర్వాత కెప్టెన్‌ కోహ్లి స్వదేశానికి రానుండటంతో అయ్యర్‌ టెస్టు అరంగేట్రానికి అవకాశాలు మరింత మెరుగయ్యాయి. టీమిండియా ఈ పర్యటనలో ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, మూడు టి20లు, నాలుగు టెస్టులు ఆడుతుంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top