IPL Incredible Awards: ఉత్తమ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ.. కోహ్లి, బుమ్రాలకు అవార్డులు, ధోనికి మొండిచెయ్యి 

Rohit Sharma Wins The Best Captain In Star Sports Incredible Awards - Sakshi

తొట్ట తొలి ఐపీఎల్‌ వేలం (2008 ఫిబ్రవరి 20) జరిగి 15 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్టార్‌ స్పోర్ట్స్‌ సంస్థ.. ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ ఇన్‌ఫో భాగస్వామ్యంలో ఐపీఎల్‌ ఇన్‌క్రెడిబుల్‌ అవార్డులను అనౌన్స్‌ చేసింది. మొత్తం ఆరు విభాగాల్లో విజేతలను ప్రకటించిన స్టార్‌ స్పోర్ట్స్‌-ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ ఇన్‌ఫో.. ఐపీఎల్‌ చరిత్రలో ఉత్తమ కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మను ఎంపిక చేసింది. రోహిత్‌ 2013-22 మధ్యలో ముంబై ఇండియన్స్‌ను 5 సార్లు ఛాంపియన్‌గా నిలిపినందున అతన్ని ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసినట్లు స్టార్‌ స్పోర్ట్స్‌-ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ ఇన్‌ఫో సంయుక్త ప్రకటన చేశాయి. 

కెప్టెన్‌గా రోహిత్‌ 143 మ్యాచ్‌ల్లో 56.64 విన్నింగ్‌ పర్సంటేజ్‌తో 79 సార్లు ముంబై ఇండియన్స్‌ను విజేతగా నిలిపాడు. ఈ విభాగంలో గౌతమ్‌ గంభీర్‌, ఎంఎస్‌ ధోని, లేట్‌ షేన్‌ వార్న్‌ నామినేట్‌ అయినప్పటికీ హిట్‌మ్యాన్‌నే అవార్డు వరించింది. 

ఉత్తమ బ్యాటర్‌ కేటగిరి విషయానికొస్తే.. ఈ విభాగంలో ఏబీ డివిలియర్స్‌, క్రిస్‌ గేల్‌, డేవిడ్‌ వార్నర్‌, సురేశ్‌ రైనా నామినేట్‌ కాగా.. ఏబీడీని అవార్డు వరించింది. మిప్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌.. 2008-21 మధ్యకాలంలో 184 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 40 హాఫ్‌ సెంచరీల సాయంతో 39.71 సగటున 5162 పరుగులు చేశాడు. ఏబీడీ.. 2016 సీజన్‌లో ఆర్సీబీ తరఫున 168.97 స్ట్రయిక్‌ రేట్‌తో 687 పరుగులు చేసి ఔరా అనిపించాడు. 

ఓ సీజన్‌లో ఉత్తమ బ్యాటింగ్‌ కేటగిరిలో విరాట్‌ కోహ్లి, క్రిస్‌ గేల్‌, డేవిడ్‌ వార్నర్‌, జోస్‌ బట్లర్‌ పోటీ పడగా.. కోహ్లి విజేతగా నిలిచాడు. కోహ్లి.. 2016 సీజన్‌లో ఆస్సీబీ తరఫున 152.03 స్ట్రయిక్‌ రేట్‌తో 973 పరుగులు సాధించాడు.

ఐపీఎల్‌ మొత్తంలో ప్రభావవంతమైన క్రికెటర్‌ కేటగిరిలో సునీల్‌ నరైన్‌, ఆండ్రీ రసెల్‌, షేన్‌ వాట్సన్‌, రషీద్‌ ఖాన్‌ నామినేట్‌ కాగా.. ఈ అవార్డు ఆండ్రీ రసెల్‌ను వరించింది. 

ఉత్తమ బౌలర్‌ కేటగిరిలో రషీద్‌ ఖాన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, సునీల్‌ నరైన్‌, యుజ్వేంద్ర చహల్‌ నామినేట్ కాగా.. బుమ్రా విజేతగా నిలిచాడు.

ఐపీఎల్‌ సీజన్‌లో ఉత్తమ ప్రదర్శన కేటగిరి విషయానికొస్తే.. ఈ విభాగంలో సునీల్‌ నరైన్‌ (2012), రషీద్‌ ఖాన్‌ (2018), జోఫ్రా ఆర్చర్‌ (2020), యుజ్వేంద్ర చహల్‌ (2022) నామినేట్‌ కాగా.. చహల్‌ను ఈ అవార్డు వరించింది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top