టీమిండియా స్టార్ ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్‌లో మరో అరుదైన మైలు రాయిని అందుకునేందుకు సిద్దమయ్యాడు. అఫ్గానిస్తాన్‌తో ధర్మశాల వేదికగా జరగనున్న తొలి వన్డేలో బరిలోకి దిగనున్న రోహిత్.. భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక వయసులో వన్డే మ్యాచ్ ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు భారత మాజీ ప్లేయర్, 1983 వరల్డ్ కప్ విజేత జట్టు సభ్యుడు మొహిందర్ అమర్‌నాథ్ పేరిట ఉంది.
ఆయన 39 ఏళ్ల 36 రోజుల వయసులో 1989లో తన చివరి వన్డే ఆడారు. ఇప్పుడు 39 సంవత్సరాల 44 రోజుల వయస్సు కలిగిన హిట్‌మ్యాన్.. అమర్‌నాథ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేయనున్నాడు. 2007లో భారత్ తరపున వన్డే అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ, 19 ఏళ్ల తన సేవలను అందిస్తూనే ఉన్నాడు.
కెరీర్ ఆరంభంలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్న రోహిత్.. ఎంఎస్ ధోని కెప్టెన్సీలో తిరుగులేని ఆటగాడిగా నిలిచాడు. ధోనీ 2013లో రోహిత్‌ను ఓపెనర్‌గా పంపడం ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఓపెనర్‌గా మారిన తర్వాతే రోహిత్ ప్రపంచ స్థాయి బ్యాటర్‌గా ఎదిగాడు. ఆ తర్వాత భారత జట్టు పగ్గాలను కూడా చేపట్టాడు. అతడి కెప్టెన్సీలోనే భారత్ 2023 ప్రపంచకప్‌ను తృటిలో కోల్పోయింది.
ఫైనల్ వరకు అజేయంగా నిలిచిన మెన్ ఇన్ బ్లూ, తుది మొట్టుపై బోల్తా పడింది. టీ20 ప్రపంచకప్-2026ను మాత్రం అతడి కెప్టెన్సీలోనే టీమిండియా గెలుచుకుంది. తన 19 ఏళ్ల కెరీర్‌లో రోహిత్ ఎన్నో ఘనతలు సాధించాడు.
వన్డే క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా చారిత్రత్మక రికార్డును ఈ ముంబైకర్ కలిగి ఉన్నాడు. అంతేకాకుండా వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు (7 సెంచరీలు) చేసిన రికార్డు రోహిత్ పేరిటే ఉంది. రోహిత్ శర్మ ఇప్పటివరకు 282 వన్డే మ్యాచ్‌ల్లో 11,577 పరుగులు సాధించాడు.


