Tokyo Olympics 2020: షేక్‌ హ్యాండ్స్‌, ​హైఫైలు అన్నీ వాటితోనే..

Robots Becoming Special Attraction In Tokyo 2020 Olympics - Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌: విశ్వక్రీడలకు ఉన్న క్రేజ్‌ వేరు. ఇప్పటివరకు జరిగిన ఒలింపిక్‌ క్రీడలు చూసుకుంటే ఎప్పుడూ ప్రేక్షకులు లేకుండా నిర్వహించలేదు. కానీ కరోనా కారణంగా మొదటిసారి విశ్వక్రీడలు ప్రేక్షకులు లేకుండానే జరుగుతున్నాయి. వాస్తవానికి గతేడాదే టోక్యో 2020 ఒలింపిక్స్‌ జరగాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడింది. ఈ దఫా ఒలింపిక్‌ క్రీడలు జపాన్‌లో జరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీతో ఒలింపిక్‌ విలేజ్‌ను తయారు చేసింది. ఇక టెక్నాలజీలో అడ్వాన్స్‌డ్‌గా ఉండే జపాన్‌ దానికి తగ్గట్టే సరికొత్త ప్రయోగంతో ముందుకు వస్తోంది. అదే రోబోటిక్‌ వ్యవస్థ.

తమ సృజనాత్మకతకు పదును పెడుతూ ప్రేక్షకులు లేని లోటును తీర్చేందుకు విశ్వక్రీడలను రోబోలతో ముస్తాబు చేస్తోంది. సాధారణంగా ఒలింపిక్స్‌ అంటే మస్కట్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ఈసారి మాత్రం జపాన్‌ దీనికి భిన్నంగా రోబోట్ల రూపంలో మస్కట్‌లను తయారు చేసి వాటితోనే షేక్‌ హ్యాండ్స్‌, ​హైఫైలు ఇప్పించనుండడం విశేషం. ప్రేక్షకులకు అనుమతి లేని నేపథ్యంలో ఈసారి స్టేడియాల్లో రోబోలు సందడి చేయనున్నాయి.

ఈవెంట్స్‌  సందర్భంగా క్రీడాకారులకు సాయంగా కూడా ఉండనున్నాయి. క్రీడాకారులకు ఆహారం, మంచినీళ్లు అందించడంతో పాటు జావెలిన్‌ త్రో, డిస్కస్‌ త్రోలు అందించడంలో సహాయపడనున్నాయి. దీనికోసం నిర్వాహకులు ఇప్పటికే పలుసార్లు ట్రయల్స్‌ కూడా నిర్వహించారు. కోవిడ్‌ కారణంగా ఆటగాళ్లకు సాయం అందించే బాధ్యతలను రోబోలకు అప్పగించనున్నారు. ఇక టోక్యో ఒలింపిక్స్‌కు అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న టయోటా కంపెనీ రోబోల తయారీలో తనదైన ముద్ర వేసింది. 17 రోజులపాటు అభిమానులను అలరించనున్న విశ్వక్రీడల్లో రోబోలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top