ఆర్సీబీ ఇంటిదారి‌, వైరలైన ధోని మీమ్‌

RCB Exit From IPL 2020 England Women Cricketers Tweet Goes Viral - Sakshi

అబుదాబి: ఏ సాలా కప్‌ నామ్దే (ఈసారి కప్పు మాదే) అంటూ ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ జట్టు ఇంటిదారి పట్టింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో శుక్రవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పరాజయంపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. మేటి ఆటగాళ్లతో పటిష్టంగా ఉన్న ఆర్సీబీ ఇప్పటివరకూ ఒక్క ఐపీఎల్‌ ట్రోఫీని గెల్చుకోలేదు. దీంతో ఆర్సీబీ జట్టుకు ఐపీఎల్‌ విజేతగా నిలిచే భాగ్యం ఉందా అని అభిమానులు సోషల్‌ మీడియాలో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు కెప్టెన్‌గా కోహ్లిని తప్పిస్తేనే జట్టు జాతకం మారుతుందని అంటున్నారు. ఈక్రమంలో ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్లు అలెక్స్‌ హార్ట్లీ, కేట్‌ రాస్‌ ట్విటర్‌ వేదికగా చేసిన ఓ పోస్టు వైరల్‌ అయింది. 

ఆర్సీబీ ఎప్పటికైనా ఐపీఎల్‌ టైటిల్‌ గెలుస్తుందా? అని అలెక్స్‌ హార్ట్లీ ప్రశ్నించగా.. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదు’అని ధోని ఫొటోతో కూడిన మీమ్‌ను కేట్‌ రాస్‌ బదులిచ్చింది. కాగా, ఇటీవల అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగిన ఎంఎస్‌ ధోని ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెబుతాడనే ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఐపీఎల్‌ తాజా సీజన్‌ సీఎస్‌కే చివరి మ్యాచ్‌లో ధోనిని ఓ వ్యాఖ్యత అడగ్గా.. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదు’అని ధోని సమాధానం ఇచ్చాడు. దాంతో ధోని అభిమానులు సంతోషంలో మునిగితేలారు. ధోని కామెంట్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ అయింది. ఇప్పుడు ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్‌ ఆర్సీబీ ఐపీఎల్‌ టైటిల్‌ గెలవడానికి ఆ కామెంట్‌ను ఆపాదించడంతో మరోసారి వైరల్‌ అయింది. గత ఐపీఎల్‌ 12 సీజన్‌లలో మూడుసార్లు ఫైనల్‌ చేరిన బెంగుళూరు ఒక్కసారి కూడా కప్పును ముద్దాడలేదు. ఈసారైనా ఆ కల నెరవేరుతుందని ఆశపడ్డ అభిమానులు కలలు కల్లలయ్యాయి!!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top